మోహన్ బాబుకు ముక్కు మీద కోపమనే విషయం ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. ఇప్పుడీ సీనియర్ నటుడికి మరోసారి కోపమొచ్చింది. ఇంతకీ కారణం ఏంటంటే.. ఆయన పేరును కొంతమంది రాజకీయంగా వాడుకుంటున్నారట. ఇది ఆయన కోపానికి కారణం.
“ఈమధ్య నా పేరు రాజకీయంగా కొందరు ఉపయోగించుకుంటున్నట్టు నా దృష్టికి వచ్చింది. దయచేసి ఏ పార్టీ వారైనా వాళ్ల ప్రయోజనాల కోసం నా పేరును వాడుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. మనం అనేక రకాల భావావేశాలున్న వ్యక్తుల ప్రపంచంలో జీవిస్తున్నాం. ఎవరి అభిప్రాయాలు వాళ్లవి. అది వారి వ్యక్తిగతం. సంబంధం లేని వాళ్లను రాజకీయ పార్టీల్లోకి, వాళ్ల అనుబంధ సంస్థల్లోకి తీసుకురావడం బాధాకరం. ఇకపై ఇలాంటి ఉల్లంఘనలకు పాల్పడితే న్యాయపరమైన చర్యలు తీసుకుంటాను.”
ఇలా తన పేరును రాజకీయంగా వాడుకోవడానికి ప్రయత్నిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని వార్నింగ్ ఇచ్చారు మోహన్ బాబు. చేతనైతే నలుగురికి సాయపడ్డంపైనే మనం దృష్టిపెట్టాల తప్ప, రాజకీయాలు చేయకూడదని అన్నారు. అందరూ శాంతి-సౌభ్రాత్రుత్వం వ్యాపింపచేయడానికి బద్ధులై ఉండాలన్నారు.
2019 ఎన్నికల్లో వైసీకి మద్దతుపలికారు మోహన్ బాబు. ఆ టైమ్ లో చంద్రబాబుపై ఎన్నో తీవ్ర విమర్శలు చేశారు. ఆ తర్వాత పూర్తిగా రాజకీయాలకు దూరమయ్యారు. ఈమధ్య ఆయన బీజేపీలోకి చేరుతారంటూ వార్తలొచ్చాయి. కానీ ఇప్పటివరకు అలాంటిదేం జరగలేదు.