పోగొట్టుకున్న చోటనే వెదుక్కోవాలంటారు పెద్దలు. జనసేనాని పవన్ కళ్యాణ్ ఆ సూత్రాన్నే నమ్ముకున్నట్లుగా ఉంది. గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక నుంచి పోటీ చేసిన పవన్ రెండు చోట్లా ఓటమిపాలైన సంగతి తెలిసిందే.
అయినప్పటికీ వచ్చే ఎన్నికల్లో ఆయన మళ్ళీ భీమవరం నుంచే పోటీ చేస్తున్నాడు. కానీ ఆ నియోజకవర్గం ఆయనకు కలిరాదని, అక్కడ ఓడిపోవడం ఖాయమని జనసైనికులు చెబుతున్నారు. పవన్ ను ఎలాగైనా ఓడగొట్టాలని వైసీపీ కూడా పట్టుదలగా ఉంది.
ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేసే స్థానం పైన ప్రకటన చేశాడు. 2019 ఎన్నికల్లో ఓడిన నియోజకవర్గం నుంచే మరోసారి పోటీ చేసి అక్కడే గెలవాలని నిర్ణయించాడు. గత ఎన్నికల్లో పవన్ కు భీమవరంలో 62,285 ఓట్లు పోలయ్యాయి. టీడీపీ నుంచి పోటీ చేసిన పులపర్తి రామాంజనేయులుకు 54,037 ఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్ది గ్రంధి శ్రీనివాస్ కు 70,642 ఓట్లు రాగా.. ఆయన 8,357 ఓట్లతో విజయం సాధించారు.
ఈ సారి టీడీపీ మద్దతుతో పోటీ చేయటం ద్వారా పవన్ గెలిచి అసెంబ్లీలో భీమవరం నుంచే అడుగు పెట్టాలని డిసైడ్ అయ్యారు. ఈ సారి భీమవరం నుంచి వైసీపీ అభ్యర్దిగా సిట్టింగ్ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ను సీఎం జగన్ ఖరారు చేసారు. భీమవరం సభలో ఈసారి రీల్ స్టార్ పైన రియల్ స్టార్ ను బరిలోకి దిగుతున్నారని జగన్ ప్రకటించారు.
ఈసారి టీడీపీ, జనసేన కలవటం ద్వారా పవన్ గెలుపు ఖాయమని కొందరు చెబుతున్నారు. అయితే, పవన్ పైన విజయం ఈ సారి వైసీపీకి ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. భీమవరం వచ్చిన పవన్ కల్యాణ్ తాజాగా జిల్లా టీడీపీ నేతలతో సమావేశమయ్యాడు. తాను భీమవరం నుంచి పోటీ చేయబోతున్నట్లు స్పష్టత ఇచ్చిన ఆయన.. టీడీపీ నేతలు సహకరించాలని కోరాడు .
జిల్లా నేతలు తాము పూర్తిగా సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే పవన్ భీమవరం అసెంబ్లీ పరిధిలోనే ఇంటిని తీసుకుంటున్నాడు. అక్కడే మకాం ఉంటానని ప్రకటించేందుకు సిద్దమయ్యాడు. భీమవరం నుంచి పోటీ చేయటం ద్వారా గోదావరి జిల్లాల్లో ప్రభావం ఉంటుందని భావిస్తున్నాడు. రెండో స్థానంగా రాయలసీమ నుంచి తిరుపతి అసెంబ్లీ బరిలో ఉంటారని సమాచారం.
ఇదిలా ఉంటే, జనసేనలో చాలామంది నాయకులు భీమవరం కలిసిరాలేదని చెబుతున్నారు. సాధారణంగా జనసేనకు ప్లస్‌పాయింట్‌గా ఉండే కాపు సామాజికవర్గమే ఇక్కడ పవన్‌కు మైనస్ కానుందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే గత ఎన్నికల్లో పవన్‌ను మట్టి కరిపించిన వైసీపీ నేత గ్రంధి శ్రీనివాస్‌ది కూడా కాపు సామాజిక వర్గమే.
పైగా ఆయన స్థానికంగా అందుబాటులో ఉండే నేత, వివాద రహితుడు. ప్రభుత్వ పథకాలు అందనివారెవరైనా ఉంటే తప్ప ఆయనకు వ్యక్తిగతంగా నియోజకవర్గంలో నెగటివ్ లేదు. పైగా ఒకే సామాజికవర్గం. దీంతో కాపులు పవన్ కంటే గ్రంధికే ఎక్కువ విలువిస్తారని భీమవరంలో టాక్.
ఈమధ్య పవన్ భీమవరం వచ్చినప్పుడు పట్టణంలో ర్యాలీగా వెళ్ళాడు. ఇందులో జనసైనికుల హడావుడే తప్ప ఓ నాయకుడు వచ్చాడని ఏ ఇంట్లో నుంచీ జనం తొంగి చూడలేదు. కనీసం సినిమా హీరోగా అయినా క్రేజ్ ఉంటుంది కదా. కానీ జనసైనికులు షేర్ చేస్తున్న వీడియోల్లో కూడా పవన్ చేతులూపుతున్న దృశ్యాలే తప్ప కేరింతలు కొడుతున్న జనం కనపడలేదు.
పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో భీమవరం నుంచి పోటీ చేసినప్పుడే చాలామంది పెదవి విరిచారు. అదో ప్రత్యేక నియోజకవర్గమని, అక్కడ రాజులకు, కాపులకు పోటీ తప్ప కాపులకు, కాపులకు పోటీ ఏమిటని ప్రశ్నించారు. సొంత జిల్లాలోని పాలకొల్లులో చిరంజీవే ఓడిపోయినా కూడా ప్రజారాజ్యం అభ్యర్థిని గెలిపించుకున్న తాడేపల్లిగూడెం లాంటి సీటు అయితే సేఫ్ అని చెప్పారు. అయినా పవన్ వినకుండా వెళ్లి బోర్లాపడ్డాడు. ఇప్పుడు మళ్లీ అదే తప్పు చేస్తున్నాడని అంటున్నారు.