చంద్రబాబునాయుడు రాజకీయాల్లో ఆరితేరారు. చెప్పేది చేయరు, చేసేది చెప్పరు. ఎదుటి వాళ్ల మనసులో ఏమున్నదో తెలుసుకోడానికే ఆయన ప్రాధాన్యం ఇస్తుంటారు. తాము చెప్పేది వినడానికి చంద్రబాబు ఆసక్తి చూపారని నమ్మించేందుకు ఆయన ప్రయత్నిస్తుంటారు. చంద్రబాబు చెప్పేది నిజమని నమ్మి, అంతా ఆయనే చూసుకుంటారని అనుకుంటే, అది వారి తప్పు. అంతే తప్ప, చంద్రబాబుది కాదని తెలుసుకోవడం మంచిది.
తాజాగా టికెట్లు దక్కించుకున్న అభ్యర్థులతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వీళ్లతో బాబు మాట్లాడుతూ… కీలక కామెంట్స్ చేశారు. వారిని గట్టిగా హెచ్చరించినట్టు బలమైన సంకేతాలు వెళ్లేలా చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఇప్పటికే టీడీపీలో అభ్యర్థుల ఎంపిక తీవ్ర గందరగోళం నెలకుంది. టికెట్లు దక్కని ఆశావహులు పక్క చూపులు చూస్తున్నారు. తమకు ఎటూ టికెట్ దక్కలేదని, అలాంటప్పుడు మరొకరి నాయకత్వాన్ని ఎందుకు బలపరచాలనే నెగెటివ్ ఆలోచనలు టీడీపీ నేతల్లో క్రమంగా పెరుగుతున్నాయి.
టికెట్లు దక్కని నేతల ఆలోచనలు ఏ విధంగా వుంటాయో చంద్రబాబుకు బాగా తెలుసు. అందుకే అలాంటి నేతల్లో ఆశలు చిగురించేలా చంద్రబాబు కీలక కామెంట్స్ చేశారు.
‘అభ్యర్థినంటూ అహంకారంతో విరవీగితే రాజకీయాల్లో కుదరదు. మొదటి జాబితాలో సీట్లు దక్కించుకున్న నేతల పనితీరు సరిగా లేకుంటే మార్చి కొత్తవారికి ఇవ్వడానికి వెనుకాడేది లేదు. ప్రతి వారం మీ పనితీరు సమీక్షిస్తా. ఏ మాత్రం తేడా వచ్చినా వేటు తప్పదు’ అని చంద్రబాబు హెచ్చరించారు.
చంద్రబాబు హెచ్చరికలను చూస్తే ఎవరికైనా ఏమనిపిస్తుంది…. ఏమో మన నియోజకవర్గంలో అభ్యర్థి పనితీరు నచ్చకపోతే మార్చి, మనకే ఇవ్వొచ్చేమో అనే భ్రమలోకి ఆశావహులను నెట్టేందుకే చంద్రబాబు వార్నింగ్ ఇచ్చినట్టు బిల్డప్ ఇచ్చారు. ఇవన్నీ టికెట్ ఆశావహులను ఇతర పార్టీల్లోకి వెళ్లకుండా అడ్డుకునేందుకే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతే తప్ప, చంద్రబాబు సర్వేలు చేయించడం, మళ్లీ మార్చడం లాంటివి ఎట్టి పరిస్థితుల్లో వుండవు. చంద్రబాబు మార్క్ పొలిటికల్ డ్రామాకు తాజా వార్నింగ్ కామెంట్సే నిదర్శనం.