చిత్తూరు జిల్లాలో రసవత్తర రాజకీయం నడుస్తోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏడుగురు అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించారు. ఈ జిల్లాలో జనసేనకు ఇచ్చే సీట్లపై ఇంకా స్పష్టత రాలేదు. తంబళ్లపల్లె టీడీపీ టికెట్‌ను ఇన్చార్జ్ అయిన మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్‌ను కాదని దాసరిపల్లి జయచంద్రారెడ్డికి దక్కింది. దీంతో మొదటి నుంచి టీడీపీ జెండా మోస్తున్న కార్యకర్తలు, నాయకులు షాక్‌కు గురయ్యారు.
తంబళ్లపల్లె టీడీపీ కార్యాలయంలో పార్టీ జెండాలు, ప్లెక్సీలను చించిపడేశారు. అంతటితో వారి నిరసన ఆగలేదు. బీసీ నాయకుడైన శంకర్ యాదవ్‌కు ఇవ్వకపోతే తంబళ్లపల్లెలో పార్టీని మట్టి కరిపిస్తామని వారు హెచ్చరించారు. తన టికెట్ విషయమై పునరాలోచించాలని, లేదంటే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని శంకర్ యాదవ్ హెచ్చరించారు.
శంకర్‌యాదవ్‌కు కాకుండా, పార్టీతో సంబంధం లేని వ్యాపారవేత్తకు టికెట్ ఇవ్వడాన్ని నిరసిస్తూ తంబళ్లపల్లె టీడీపీ కార్యకర్తలు, నాయకులు ఇవాళ చంద్రబాబు ఇంటి ముట్టడికి దిగారు. రాజధాని ప్రాంతంలో ఉన్న చంద్రబాబు ఇంటి ఎదుట తంబళ్లపల్లె టీడీపీ శ్రేణులు హల్చల్ చేశాయి. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బినామీ అయిన జయచంద్రారెడ్డికి టికెట్ ఇచ్చారని విమర్శించారు.
బీసీ నాయకుడైన శంకర్ యాదవ్‌కు టికెట్ ఇవ్వకపోతే వెనుకబడిన కులాలు టీడీపీకి అండగా నిలవరని హెచ్చరించారు. శంకర్ యాదవ్‌కే టికెట్ ఇవ్వాలని, లేదంటే ఓడిస్తామని చంద్రబాబు ఇంటి ఎదుటే హెచ్చరించడం గమనార్హం.