ప్రత్యర్థి ప్రకాశ్‌రాజ్ ప్యానల్‌పై మంచు విష్ణు ప్యానల్ నుంచి పరోక్షంగా పంచ్‌లు మొదలయ్యాయి. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలకు మంచు విష్ణు సారథ్యంలోని ప్యానల్ సభ్యులు మంగళవారం నామినేషన్లు దాఖలు చేశారు. అనంతరం అధ్యక్ష బరిలో నిలిచిన మంచు విష్ణు తన ప్యానల్‌ను పరిచయం చేయడంతో పాటు పలు అంశాలపై మనసులో మాటను మీడియాతో పంచుకున్నారు.
ఎవరి ప్యానల్ బలమైందనే ప్రశ్న మీడియా ప్రతినిధుల నుంచి వెళ్లింది. “మాదే” అంటూ ప్యానల్ సభ్యులు బిగ్గరగా అరిచారు. మంచు విష్ణు నాయకత్వం వర్ధిల్లాలని నినదించారు. ఈ సందర్భంగా ప్యానల్ నుంచి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా పోటీ చేస్తున్న బాబు మోహన్ మాట్లాడుతూ తమది తెలుగు ప్యానల్ అని, తెలుగు వారి ఆత్మగౌరవ ప్యానల్ అని ప్రకటించడం విశేషం.
ప్రత్యర్థి ప్రకాశ్‌రాజ్ తెలుగేతరుడు కావడంతో, ఆయన గురించి పరోక్షంగా సెటైర్ విసిరారని టాలీవుడ్‌లో చర్చించుకుంటున్నారు. తమది తెలుగు వారి ఆత్మగౌరవ ప్యానల్ అని ప్రచారానికి శ్రీకారం చుట్టడం ద్వారా, ప్రధాన పోటీదారైన ప్రకాశ్‌రాజ్ ప్యానల్ తెలుగుకు సంబంధించినది కాదని చెప్పకనే చెప్పినట్టైంది.
తద్వారా తెలుగు సెంట్‌మెంట్‌తో ప్రకాశ్‌రాజ్ ప్యానల్‌ను ఆత్మరక్షణలో పడేయాలని ఎత్తుగడకు మంచు విష్ణు ప్యానల్ వ్యూహం రచించినట్టు తెలుస్తోంది. మంచు విష్ణు ప్యానల్ ఇదే ప్రధాన ప్రచార అస్త్రంగా చేసుకుని ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేయొచ్చనే చర్చ జరుగుతోంది.