డిసెంబర్ 9న రాత్రి 7.15 గంటలకు మెగా కుటుంబంలో చిరస్మరణీయమైన వేడుకకు ముహూర్తం ఫిక్స్ అయింది. ముహూర్తం అంటే సినిమా ఫంక్షన్ అనుకునేరు. అలాంటిదేమీ లేదు.
మెగా బ్రదర్ నాగబాబు తనయ, వర్తమాన హీరోయిన్ నిహారిక కొణిదెల, చైతన్య జొన్నగడ్డ వివాహానికి ముహూర్తం ఖరారైంది. పైన పేర్కొన్నట్టు ఆ శుభ సమయాన నిహారిక మెడలో చైతన్య మూడు ముళ్లు వేసేలా పెద్దలు ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈ విషయాన్ని వరుడి తండ్రి, గుంటూరు ఐజీ జె.ప్రభాకర్‌రావు తెలిపారు.
కలియుగ దైవం శ్రీవారి దర్శనం కోసం ప్రభాకర రావు దంపతులు బుధవారం తిరుమల వెళ్లారు. స్వామి వారి సేవలో పాల్గొ న్నారు. ఈ సందర్భంగా నిహారిక, చైతన్య వివాహ పత్రికను స్వామి వారి చెంత ఉంచి, ఆశీర్వచనం తీసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన వివాహ వివరాలను వెల్లడించారు. రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయపూర్‌లో ఉన్న ఉదయ్ విలాస్‌ను వివాహ వేదికగా ఖరారు చేసినట్లు చెప్పారు.
ఎవరూ ఊహించని విధంగా రాజస్థాన్‌లో వివాహ వేడుక తలపెట్టడం వెనుక ప్రత్యేక కారణమేదో ఉండే ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఆ వివరాలను నిహారిక లేదా చైతన్య కుటుంబ సభ్యులు త్వరలో వెల్లడించే అవకాశాలున్నాయని మెగా అభిమానులు చెబుతున్నారు. మెగా ఇంటా ఏది జరిగినా సంథింగ్ స్పెషల్ అని చెప్పక తప్పదు.