వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌వర్మ వెటకారానికి హద్దు లేకుండా పోతోంది. తన, మన అనే భేదం లేకుండా సోషల్ మీడియా వేదికగా సెటైర్లు విసురుతున్నారు.
ఇదేమని ఆయన్ను ప్రశ్నించే సాహసం ఏ ఒక్క సినీ పెద్ద చేయకపోవడం గమనార్హం. వర్మ అంటే భయమా లేక ఆయన గురించి పట్టించుకోవడం టైమ్ వేస్ట్ అని భావిస్తున్నారా? అనేది అర్థం కావడం లేదు.
గత కొంత కాలంగా ‘మా’ ఎన్నికలు సృష్టించిన హడావుడి అంతా ఇంతా కాదు. ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణు ప్యానళ్లు వర్గాలుగా విడిపోయి ప్రొఫెసనల్ రాజకీయ నాయకులకు మించి పరస్పరం విమర్శలు చేసుకున్నారు. ఆవేశకావేశాలకు లోనై తిట్టు కున్నారు. కొట్టు కోవడం ఒక్కటే తక్కువ. ఈ నేపథ్యంలో రాంగోపాల్‌వర్మ తనదైన శైలిలో ‘మా’ను అడ్డుపెట్టుకుని తోటి కళాకారులపై వ్యంగ్యాస్త్రాలు విసరడం ప్రాధాన్యం సంతరించుకుంది.
‘మా’ ఒక సర్కస్ అని రెండు రోజుల క్రితం వర్మ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ట్విటర్ వేదికగా ఆయన సెటైర్ విసిరారు. సిని‘మా’ ఓ సర్కస్ అని, అందులో ఉన్నవారంతా జోకర్లు అంటూ వర్మ ట్వీట్ చేశారు.
నిజానికి జోకర్లకు ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. కానీ అవహేళన చేసే దృష్టితో సినీ కళాకారులందరినీ వర్మ జోకర్లని అభివర్ణించడంపై ఆ రంగానికి చెందిన వాళ్లు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.