మైత్రీ కి భారీ నష్టాలు తప్పవా?

ఇద్దరు హీరోలు పోటా పోటీగా తమ సినిమాలను ఒకే సారి బరిలోకి దింపడం వల్ల నిర్మాతలకు నష్టమే కానీ లాభం వుండదు. అది కొత్తగా ప్రూవ్ చేయాల్సిన సంగతి కాదు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితే…

ఇద్దరు హీరోలు పోటా పోటీగా తమ సినిమాలను ఒకే సారి బరిలోకి దింపడం వల్ల నిర్మాతలకు నష్టమే కానీ లాభం వుండదు. అది కొత్తగా ప్రూవ్ చేయాల్సిన సంగతి కాదు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితే మైత్రీ మూవీస్ కు ఎదురుకాబోతోంది. 2023 సంక్రాంతికి పోటా పోటీగా బాలకృష్ణ, మెగాస్టార్ ల సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఇది అనివార్యమైన పరిస్థితి. బాలకృష్ణ, మెగాస్టార్ లతో రెండు భారీ క్రేజీ ప్రాజెక్టులు టేకప్ చేసామన్న ఆనందం ఇప్పుడు మైత్రీ నిర్మాతలకు లేకుండా పోయింది. ఆ ఆనందం ప్లేస్ లో ఆందోళన లాంటి టెన్షన్ చోటు చేసుకుంది.

రెండు సినిమాలు పూర్తిగా ఇంకా రెడీ కాలేదు. పోటా పోటీగా, యుద్ద ప్రాతిపదికన సినిమాలు రెడీ చేస్తున్నారు. బాలయ్య సినిమాకు కాస్త తక్కువ వర్క్ వుంది. నవంబర్ నెలాఖరుకు పూర్తవుతుందని అంచనా. మెగాస్టార్ సినిమాకు కాస్త ఎక్కువ వర్కే వుంది. డిసెంబర్ వేళకు పూర్తవుతుందని టాక్. ఈ రెండు సినిమాలను వేరు వేరు నెలల్లో విడుదల చేసిందానికీ, ఒకేసారి విడుదల చేసిందానికీ మధ్య కనీసం ముఫై కోట్లు తేడా వుంటుందని ఇండస్ట్రీ బిజినెస్ సర్కిళ్లలో వినిపిస్తోంది.

రెండు సినిమాలు ఒకేసారి విడుదల చేయడం వల్ల అనుకున్న మేరకు అడ్వాన్స్ లు రావడం కష్టం అవుతుంది. పోనీ అదేం పెద్ద సమస్య కాదు అనుకున్నా, మంచి సోలో ఓపెనింగ్ లు అయితే రావు. దాని వల్ల మంచి నెంబర్లు కనిపించవు. పైగా పోటా పోటీగా రెండు సినిమాలు ఒకేసారి రావడం వల్ల ఎంత కాదన్నా ఒకటి కొంచెం ఎక్కువ బాగుంది..ఒకటి కొంచెం తక్కువ బాగుంది అనే టాక్ తప్పదు.

పైగా బలమైన ఫ్యాన్ బేస్ లు వున్న హీరోలు ఇద్దరు. అందువల్ల ఒకరి సినిమా మీద మరొకరి ట్రోలింగ్ లు తప్పవు. ఇవన్నీ సినిమా మీద ప్రభావం చూపించే అవకాశం వుంది. ఇన్ సైడ్ వర్గాల కథనం ప్రకారం ఒక్కో సినిమాకు 15 కోట్ల రెవెన్యూ తేడా వుంటుందని ప్రస్తుతానికి అంచనా వేస్తున్నారు. ఒక వేళ ఒక సినిమా పెద్ద హిట్ అయి, రెండో సినిమా యావరేజ్ అయినా ఇదే పరిస్థితి లేదా రెండూ మంచి సినిమాలు అనిపించుకున్నా ఇదే పరిస్థితి అనే అంచనాలు బిజినెస్ సర్కిళ్లలో వినిపిస్తున్నాయి.

ఇవన్నీ ఇలా వుంచితే ఆంధ్రలో ఈ మధ్య కాలంలో టికెట్ రేట్లు అదనంగా ఇవ్వడం అన్నది లేదు. ఎందుకుంటే జనాలు మామూలు రేట్లకే రావడం లేదు కనుక. సంక్రాంతి కనుక అదనపు రేట్లు అడగాలి అన్నా ఇటు బాలయ్య సినిమాకు ఇవ్వాలి. అటు మెగాస్టార్ సినిమాకూ ఇవ్వాలి. ఆదిపురుష్ వస్తే దానికీ ఇవ్వాలి. అందువల్ల ఇంత మందికి ఇస్తారా? ఎవరికీ ఇవ్వరా అన్నది కూడా తేలాల్సి వుంది.

అసలు ఇవన్నీ ఇలా వుంచితే ఏ సినిమా ముందు ఏ సినిమా వెనుక అన్నది ఇప్పటి వరకు తేలలేదు. అందరూ సంక్రాంతికే సినిమా అంటున్నారు కానీ డేట్ లు కొట్టడం లేదు. ఇప్పటికీ ఇంకా నాలుగు సినిమాలూ వస్తాయా? లేక ఏ ఒకటి అయినా తగ్గుతుందా? అన్నది తెలియదు. తమిళంలో అజిత్ సినిమా కూడా రంగంలోకి దిగుతోంది. మరి దాని డబ్బింగ్ కూడా తెలుగులో సంక్రాంతికి వస్తుందా? డబ్బింగ్ రానివ్వం అనడానికి ఈసారి ఆస్కారం లేదు. ఎందుకంటే దిల్ రాజు సంక్రాంతికి అందిస్తున్న వారసుడు సినిమా పక్కా డబ్బింగ్ సినిమా నే కదా?

మొత్తం మీద రెండు భారీ సినిమాలు అందిస్తున్నామన్న ఆనందం కన్నా టెన్షన్ నే ఎక్కువయింది మైత్రీ సంస్థకు.