తన సినిమా ఎంట్రీ విషయంలో కాస్త ఓవర్ ఎక్స్ పోజర్ జరిగిన మాట వాస్తవం అని, అప్పుడప్పుడే సోషల్ మీడియా పాపులర్ అవుతున్న సమయంలో తాను ఎంట్రీ ఇచ్చానని, ఆ టైమ్ లో అక్కినేని ఫ్యాన్స్ తనపై ఎక్కువ హోప్స్ పెట్టుకోవడం జరిగిందని హీరో అఖిల్ అక్కినేని అంగీకరించారు. గ్రేట్ ఆంధ్రతో మాట్లాడుతూ పలు విషయాల మీద క్లారిటీ ఇచ్చారు.
లార్జ్ కాన్వాస్ సినిమాలు చేయడం తనకు ఇష్టమన్నారు. ఏజెంట్ సినిమా విడుదల నేపథ్యంలో అఖిల్ మీడియాలకు ఇంటర్వూలు ఇచ్చారు. కథనే నమ్ముకుంటాను కానీ కాంబినేషన్లు కాదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పెద్ద దర్శకులతో పని చేయడం తనకూ ఇష్టమే అని, కానీ అలాంటి ప్రతిపాదనలు వారి వైపు నుంచి రావాలని అన్నారు. తనకు సింక్ అయిన జనాలతో కలిసి పని చేస్తే అది వేరుగా వుంటుందని అన్నారు. పేర్లు అనేవి పోతున్నాయని, రెండో సినిమాతోనే కేజిఎఫ్ దర్శకుడు పెద్ద హిట్ కొట్టారని అన్నారు.
తొలి సినిమా విఫలమైన తరువాత తాను కాస్త నిరాశ చెందిన మాట వాస్తవమని, ఆ సమయంలో ఒకటి రెండు రోజులు గదిలో ఒంటరిగా వుండిపోయిన మాట కూడా వాస్తవమే అని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తన కెరీర్ కు సంబంధించి తండ్రితో ఎప్పుడు ఏ గొడవ రాలేదని, తాము పక్కా ఫ్రెండ్స్ లా వుంటామని, అది తన అదృష్టమని అన్నారు. తన తల్లి ప్రతి విషయాన్ని కూడా పాజిటివ్ కోణంలోనే చూస్తారని చెప్పారు.
దర్శకుడు సురేందర్ రెడ్డి తన దగ్గరకు వచ్చినపుడు , సమ్ థింగ్ వైల్డ్ గా ఏదైనా చేయాలని అనుకున్నామని ముందు రెండు మూడు లైన్లు విన్నా కూడా వాటిని ఓకె చేయలేదని, ఆఖరికి ఈ లైన్ ఓకె అయిందని చెప్పారు. సినిమా స్క్రిప్ట్ తయారు చేసేటపుడు కచ్చితంగా తెలుగు ఆడియన్స్ అభిరుచిని దృష్టిలో పెట్టుకున్నామని, మమ్ముట్టి క్యారెక్టర్ లో ఎమోషనల్ కంటెంట్ చాలా వుంటుందని చెప్పారు. సెకండాఫ్ లో డ్రామా కూడా మిక్స్ అవుతుందన్నారు.
ఈ సినిమా బాగుండి, తాను మాత్రం అందులో ఫిట్ కాలేదని ఎవరన్నా అనుకుంటే అది తన తప్పే అవుతుందని, క్యారెక్టర్ ను చేసి మెప్పించలేకపోయాననే అనుకుంటానని అఖిల్ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఫియర్ లెస్ గా పనిచేయాలని డిసైడ్ అయిపోయానన్నారు. ఎక్స్ ట్రీమ్ ప్రయోగం చేస్తే యాక్సెప్ట్ చేయడానికి ఆడియన్స్ సిద్దంగా వున్నారన్నారు.
తాను మరీ ఎక్కువగా అంటే ఓవర్ గా అనలైజ్ చేసుకుంటానని, ఇది తనకు బాగా వుందని అఖిల్ మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఆత్మ విమర్శ అన్నది తరచు చేసుకుంటానని, తాను ఎక్కడ తప్పు చేసాను, ఎక్కడ బరువు అవుతున్నాను, ఎక్కడ ప్లస్ అవుతున్నాను ఇలాంటివి అన్నీ తరచు ఆలోచిస్తూనే వుంటా అన్నారు. తనలో ఎవరికైనా ఏదైనా మంచి కనిపిస్తే అది ఆ ఆత్మ విమర్శ నుంచి వచ్చిందే అన్నారు.