ఒకపుడు ఎర్ర బస్సులలో తిరిగే జనాలు ఇపుడు ఎయిర్ బస్సులలో కలియ తిరుగుతున్నారు. ఇది జీవన ప్రమాణాలు పెంచేదిగానే చూస్తున్నారు. అభివృద్ధికి సంకేతంగా భావిస్తున్నారు. విమానయానం అంటే ఒకప్పుడు కల. ఇపుడు నిత్య జీవితంగా మారింది.
అందుబాటులోకి వచ్చిన ప్రగతిని సద్వినియోగం చేసుకుంటూ ఎదిగిన వారు అంతా ఇపుడు ఆకాశయానాన్నే ఎంచుకుంటున్నారు. ఒకప్పుడు సంక్రాంతి వంటి పెద్ద పండుగలకు సొంతూళ్ళకు వచ్చేవారు రైళ్లు బస్సులను ఆశ్రయించేవారు ఇపుడు మాత్రం విమానాలకే తొలి ప్రాధాన్యత ఇస్తున్నారు. అలా జీవితంలో వేగం పెరిగింది. బతుకు సైతం అందనంత ఎత్తుకు ఎదిగింది.
విశాఖ ఎయిర్ పోర్టు నుంచి 2022-23 సంవత్సరంలో అక్షరాలా పాతిక లక్షల మంది ప్రయాణీకులు ప్రయాణించినట్లుగా అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఏపీలోని ఉన్న విజయవాడ ఎయిర్ పోర్టు నుంచి ఇదే ఏడాదితో తొమ్మిది లక్షల మంది, రాజమండ్రీ ఎయిర్ పోర్టు నుంచి నాలుగున్నర లక్షల మంది ప్రయాణించినట్లుగా గణాంకాలు తెలియచేస్తున్నాయి.
కేవలం ఒక్క ఏడాది కాలంలోనే విశాఖ ఎయిర్ పోర్టుకు ప్రయాణీకుల తాకిడి పెరిగిందని, అది యాభై శాతానికి పైగా ఉందని అధికారులు వెల్లడిస్తున్నారు. మెట్రో సిటీగా ఉన్న విశాఖలో ఈ రద్దీ మాత్రం కొత్త రికార్డునే క్రియేట్ చేసింది. రానున్న కాలంలో విశాఖ నుంచి అర కోటికి పైగా ఏడాది వ్యవధిలో ప్రయాణించేందుకు అవకాశాలు ఉన్నాయని ఎయిర్ పోర్టు అధికారులు అంచనా వేస్తున్నారు.