నాగశౌర్య ఈసారి గట్టిగా గురిపెట్టాడు. ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. మంచి కథ ఎంచుకోవడమే కాదు.. దానికి తగ్గట్టు గట్టిగా మేకోవర్ కూడా అయ్యాడు. తాజాగా విడుదలైన అతడి కొత్త సినిమా ఫస్ట్ లుక్ కు, అతడి కెరీర్ ప్రస్తుత స్థితికి చాలా దగ్గర సంబంధం ఉన్నట్టు అనిపిస్తుంది.
ముందుగా సినిమా విషయానికొస్తే.. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఓ సినిమా చేస్తున్నాడు నాగశౌర్య. ఇందులో ఆర్చర్ (విలుకాడు)గా కనిపించబోతున్నాడు శౌర్య. ఈ పాత్ర కోసం ఎయిట్ ప్యాక్ (సిక్స్ ప్యాక్ కాదు) కూడా సాధించాడు. దీనికి సంబంధించి తాజాగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. విల్లు ఎక్కుపెట్టి, దీక్షగా లక్ష్యానికి గురిపెట్టిన స్టిల్ ను ఫస్ట్ లుక్ గా విడుదల చేశారు.
ఇప్పుడు కెరీర్ విషయానికొస్తే.. నాగశౌర్య లేటెస్ట్ మూవీ అశ్వద్ధామ. భారీ అంచనాల మధ్య, సొంత బ్యానర్ లో శౌర్య తీసిన ఈ సినిమా అతడు ఆశించిన స్థాయి విజయాన్ని అందించలేదు. పైగా అంతకుముందు శౌర్య నటించిన నర్తనశాల, అమ్మమ్మగారిల్లు, కణం లాంటి సినిమాలన్నీ ఫ్లాపులయ్యాయి. ఓ బేబీ హిట్టయినప్పటికీ ఆ క్రెడిట్ ఎక్కువగా సమంతకే దక్కుతుంది కాబట్టి ఇప్పుడు అర్జెంట్ గా ఓ హిట్ కొట్టాలి ఈ హీరో. అందుకే ఫోకస్ మొత్తం తన కొత్త సినిమాపైనే పెట్టాడు. హిట్ కోసం గట్టిగా గురిపెట్టాడు.
స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో చేస్తున్న ఈ సినిమాతో నాగశౌర్య, తన లక్ష్యాన్ని అందుకుంటాడో లేదో చూడాలి. కేతిక శర్మ హీరోయిన్ గా నటించనున్న ఈ సినిమాను శ్రీవెంకటేశ్వర సినిమాస్, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్లపై నారాయణ్ దాస్, శరత్ మరార్ నిర్మిస్తున్నారు.