పవర్ స్టార్ సినిమా మీద బోలెడు ఆశలు పెట్టుకున్నారు దర్శక నిర్మాత ఆర్జీవీ. సుమారు అయిదు కోట్ల వరకు రాబడి వస్తుందని అంచనా వేసుకున్నారు. కానీ ఆ ఆశలన్నీ తల్లకిందులైపోయాయి. అయితే అలా అని ఆర్జీవీకి నష్టం ఏమీ లేదు. సుమారు కోటిన్నర వరకు రెవెన్యూ వచ్చినట్లు తెలుస్తోంది. కానీ ఆయన తలపడిన వివాదాల తలనొప్పితో పోల్చుకుంటే ఇది తక్కువే.
దీనంతటికీ కారణం, పవర్ స్టార్ సినిమాను పే ఫర్ వ్యూ కింద విడుదల చేయడానికి ఓ వెబ్ సైట్ కు రూపకల్పన చేసి, అందులో వుంచడమే. నిజానికి ఈ సినిమా శ్రేయాస్ ఇటి సంస్థలో విడుదల కావాల్సి వుంది. అది అయితే అండ్రాయిడ్ అప్లికేషన్. పెర్ ఫెక్ట్ ఫైర్ వాల్ సిస్టమ్ అంతా వుంది. కానీ జనసైనికులు, పవన్ అభిమానులు, మెగాభిమానుల మనోభావాలను దృష్టిలో వుంచుకుని, శ్రేయాస్ ఇటి సంస్థ ఈ సినిమాకు దూరంగా వుండిపోయింది.
దాంతో ఆర్జీవీ స్వంతంగా ఆర్జీవీ వరల్డ్ థియేటర్ అనే పేరుతో వెబ్ సైట్ పెట్టి అందులో విడుదల చేసారు. కానీ అదను కోసం కాచుకున్న జనాలు పెద్దగా టైమ్ తీసుకోకుండానే సినిమాను డౌన్ లోడ్ చేసేయగలిగారు. ముందుగా ఫేస్ బుక్ లోకి వెళ్లిపోయింది. ఆ తరువాత ఏకంగా వాట్సాప్ లోకి వచ్చేసింది. ఇంకేం వుంది. వైట్ టికెట్ లేదు, బ్లాక్ టికెట్ లేదు. ఫ్రీగా జనాలు చూసేసారు. ఆర్జీవీ కే షాక్ ఇచ్చేసారు.
ఇదే కనుక డౌన్ లౌడ్ కు వీలు లేకుండా వుండి వుంటే ఆర్జీవీ అనుకున్న టార్గెట్ రీచ్ అయి వుండేవారు. మంచి లాభాలు కళ్ల చూసి వుండేవారు. ఇప్పుడు ఇంత వివాదాలు నడిచిన తరువాత కూడా జస్ట్ కోటిన్నరతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.