మూడో పెళ్లితో నటి వనిత విజయ్‌కుమార్ సోషల్ మీడియాలో వివాదాస్పద మహిళగా గుర్తింపు పొందారు. తన మూడో పెళ్లిపై సోషల్ మీడియాలో కించపరిచే వ్యాఖ్యలు చేసిందంటూ ఓ మహిళపై వనిత ఫిర్యాదు చేయడం, ఆ తర్వాత ఆమె అరెస్ట్ తాజాగా కొత్త సమస్య తీసుకొచ్చింది. సదరు మహిళకు కరోనా పాజిటివ్ అని తేలడం, బెయిల్‌పై విడుదలైన ఆమె ఆచూకీ తెలియక పోవడంతో వడపళని పోలీసులు ఆందోళన చెందుతున్నారు.
తనపై ఓ మహిళ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్ట్ పెట్టిందంటూ నటి వనిత విజయ్‌కుమార్ వడపళని పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సదరు మహిళను గత వారం అరెస్ట్ చేశారు. అనంతరం ఆ మహిళ బెయిల్‌పై విడుదలైంది. ఇదిలా ఉండగా సదరు మహిళ అరెస్ట్ సందర్భంగా వైద్యులు శాంపిల్స్ తీసుకున్నారు.
ఆ మహిళ బెయిల్‌పై విడుదలయ్యాక కోవిడ్ నిర్ధారణ పరీక్ష ఫలితం వచ్చింది. అందులో సదరు మహిళకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో వడపళని పోలీసులు ఆ మహిళ కోసం ఆరా తీశారు. ఆ మహిళ చిరునామా మాత్రం చిక్కలేదు. ఆమెను ఆస్పత్రికి, కోర్టుకు తీసుకెళ్లిన వడపళని పోలీసులు కూడా వైద్య పరీక్ష చేసుకున్నారు. ఓ పోలీసుకు పాజిటివ్‌గా తేలింది.
దీంతో మిగిలిన సిబ్బంది, పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహించిన పోలీసులు ఆందోళన చెందుతున్నారు. అసలు సదరు మహిళ ఎవరికీ కనిపించకుండా ఎక్కడికెళ్లిందో తెలియక పోలీసులు తలలు పట్టుకున్నారు.