బిగ్‌బాస్ సీజన్-5లో అందరి అంచనాలతో తలకిందులు చేస్తూ కంటెస్టెంట్ ప్రియాంక సింగ్ అలియాస్ పింకీ 13 వారాల పాటు హౌస్‌లో కొనసాగింది. ఇదంతా ప్రేక్షకాదరణతో సాధ్యమైంది. ప్రియాంకపై మెగా బ్రదర్ నాగబాబు ప్రశంసలు కురిపించారు. ఎందరికో స్ఫూర్తిగా నిలిచావని కొనియాడారు. ఈ సందర్భంగా ప్రియాంకకు నాగబాబు ఆశీస్సులు అందించారు.
బిగ్‌బాస్ రియాల్టీ షోలో పాల్గొనక ముందు ప్రియాంక అంటే ఎవరికీ పెద్దగా తెలియదు. ఆమెకు ఎలాంటి అభిమాన సంఘాలు లేవు. ట్రాన్స్‌జెండర్‌గా బిగ్‌బాస్ హౌస్‌లో అడుగు పెట్టిన ప్రియాంక తన నడవడికతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. హౌస్‌లో టాప్-7లో ఆమె ఒకరిగా నిలవడం చిన్న విషయం కాదు.
గత వారం ఎలిమినేట్ అయిన ప్రియాంకకు గొప్ప స్వాగతం లభించింది. బహుశా హౌస్ బయట తనకు ఇలాంటి ఆదరణ లభిస్తుందని ఆమె కలలో కూడా ఊహించి వుండరు. మానస్‌తో ప్రియాంక ప్రేమ ఎపిసోడ్ హౌస్‌లో ప్రత్యేక ఎపిసోడ్. భావోద్వేగాలను అదుపు చేసుకోవడంలో ఒక్కోసారి ఇబ్బంది పడినప్పటికీ, ఆ తర్వాత పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ ప్రేక్షకుల ఆదరణను ప్రియాంక దక్కించుకున్నారు.
తనకు మద్దతుగా నిలిచిన మెగాబ్రదర్ నాగబాబును కలిసి, ఆశీర్వాదం తీసుకున్నారామె. ఈ విషయాన్ని నాగబాబు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రియాంక గురించి స్ఫూర్తిదాయక ప్రశంసలు కురిపించారు.
‘ఎన్నో అసమానతలను ధిక్కరించి, అవమానాలను, అవరోధాలను ఎదుర్కొని ఈ రోజు గొప్ప స్థానంలో నిలిచావు. నువ్వు బిగ్‌బాస్ టైటిల్ గెలవకపోవచ్చు. కానీ సమాజంలో నిత్యం నీలా అవమానాలు, హేళన ఎదుర్కొనే వారికి నువ్వొక స్ఫూర్తిగా నిలిచావు. జీవితంలో గెలవచ్చన్న ఆత్మవిశ్వాసాన్ని వారికి అందించావు. నా ప్రేమాభిమానాలు, మద్దతు నీకు ఎప్పుడూ ఉంటాయి’ అని నాగబాబు ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. ఇంతకంటే ప్రియాంకకు కావాల్సిందేముంది.