సొంత పార్టీ ఎంపీలపై ప్రధాని మోడీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ సమావేశాలకు బీజేపీ ఎంపీలు రాకపోవడంపై ఆయన సీరియస్ అయ్యారు. గైర్హాజరు ఎంపీలపై ఆయన మరోసారి అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కూడా ఆయన చట్టసభల సమావేశాలకు హాజరు కాని వారిని హెచ్చరించారు. అయినప్పటికీ వాళ్లలో మార్పు రాకపోవడం ప్రధానికి ఆగ్రహం తెప్పించింది.
ప్రస్తుతం శీతాకాల పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మంగళవారం బీజేపీ పార్లమెంటరీ సమావేశంలో మోడీ మాట్లాడుతూ ఎంపీలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఎంపీలు ఇకనైనా పార్లమెంట్ సమావేశాలను సీరియస్‌గా పరిగణించి హాజరు కావాలని కోరారు. ప్రవర్తన మార్చుకోకపోతే తానే మార్చుతానని తీవ్ర హెచ్చరిక చేశారు.
సమావేశంలో నరేంద్ర మోడీ ఏం మాట్లాడారో ఆయన మాటల్లోనే…
‘పార్లమెంట్ సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరవ్వండి. చిన్న పిల్లలకు చెప్పినట్లు ప్రతిసారీ దీని గురించి నేను ఎంపీలకు చెప్పడం సమంజసంగా లేదు. కనీసం పిల్లలు కూడా ఒక విషయాన్ని పదేపదే చెప్పించుకోరు. ఇకనైనా మారండి. ఒకవేళ మిమ్మల్ని మీరు మార్చుకోకపోతే.. సమయానుగుణ మార్పులు జరుగుతాయి’ అని బీజేపీ ఎంపీలకు మోడీ వార్నింగ్ ఇవ్వడం హాట్ టాపిక్‌గా మారింది.
ఇప్పటికైనా బీజేపీ ఎంపీలు తమ పద్ధతులు మార్చుకుని పార్లమెంట్ సమావేశాలకు సక్రమంగా హాజరవుతారేమో చూద్దాం.