బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నాగార్జున తనయుడు నాగచైతన్య తన ఫస్ట్ క్రష్ గురించి చెప్పుకొచ్చాడు. ఒకప్పటి విశ్వసుందరి సుస్మితా సేన్ తన ఫస్ట్ క్రష్ అన్నాడు చైతూ. తనకు ఇష్టమైన హీరోయిన్ల గురించి చెబుతూ.. సుస్మిత తన ఫస్ట్ క్రష్ అంటూ నాగచైతన్య చెప్పాడు.
బహుశా నాగచైతన్య తండ్రి నాగార్జునతో సుస్మిత నటించింది. రక్షకుడు సినిమాలో నాగార్జున సరసన సుస్మితా సేన్ నటించింది. అప్పటికి చైతూ హైస్కూల్ దశలో ఉండవచ్చు! ఆ దశలో ఆమెను చూసి మనసుపారేసుకున్నాడేమో ఈ హీరో. గతంలో సుస్మితను తను ఒకసారి కలిసినట్టుగా కూడా నాగచైతన్య చెప్పాడు.
బాలీవుడ్ సినిమా లాల్ సింగ్ చద్దా ప్రమోషనల్ యాక్టివిటీస్ లో భాగంగా బాలీవుడ్ నటీమణుల గురించి చైతన్య స్పందించాడు. బాలీవుడ్ లో తనకు ఇష్టమైన హీరోయిన్లు చాలా మందే ఉన్నారన్నాడు. కత్రినాకైఫ్ తన దృష్టిలో నిజమైన అందగత్తె అంటూ కితాబిచ్చాడు.
అలాగే కరీనాకపూర్ మేడమ్ కూడా తనకు చాలా ఇష్టమన్నాడు. ఇంకా ప్రియాంక చోప్రా కూడా ఇష్టమేనట. అలియా భట్ నటనకు మెస్మరైజ్ అయ్యాడట నాగార్జున తనయుడు. మొత్తానికి నాగచైతన్య ఫేవరెట్ హీరోయిన్ల జాబితా పెద్దదిగానే ఉన్నట్టుగా ఉంది. మరి వీరిలో ముందు ముందు చైతూ ఎవరెవరితో స్క్రీన్ ను షేర్ చేసుకుంటాడో!