“నాగార్జున ఓటీటీలోకి ఎంటర్ అవుతున్నారట. త్వరలోనే ఓటీటీలో ఒరిజినల్ మూవీ చేస్తారట.” కొన్ని రోజులుగా నాగార్జునపై వినిపిస్తున్న పుకారు ఇది. మరికొంతమంది మరో అడుగు ముందుకేసి నాగ్ సొంతంగా ఓటీటీ యాప్ పెట్టే ఆలోచనలో కూడా ఉన్నారంటూ కథనాలు రాశారు. ఈ రెండో ఊహాగానంపై క్లారిటీ ఇవ్వకపోయినప్పటికీ.. మొదటి పుకారుపై మాత్రం నాగార్జున స్పందించారు.
నాగ్ త్వరలోనే ఓటీటీ మూవీ చేయబోతున్నారు. ఈ సీనియర్ హీరోకు ఓ సబ్జెక్ట్ బాగా నచ్చింది. అది ఓటీటీలోనే బాగుంటుందని నాగ్ ఫీలింగ్. అందుకే త్వరలోనే ఓటీటీలో అడుగుపెడుతున్నానని ప్రకటించారు నాగార్జున.
“ఓ ఐడియా అనుకున్నాం. అది నాకు బాగా నచ్చింది. ప్రస్తుతం ఇంకా డెవలప్ చేసే స్టేజ్ లోనే ఉంది. ఆ స్టోరీలో నటించాలనుకుంటున్నాను. అంతా అనుకుంటున్నట్టు అది ఓటీటీ సినిమానే. ఈ వేదిక నాకు చాలా కొత్త. అందుకే కాస్త ప్రయోగాలు చేయాలనుకుంటున్నాం. సినిమాల్లో ఇప్పటివరకు నేను ట్రై చేయనివి ఇందులో చేయబోతున్నాను.”
ఇలా తన ఓటీటీ ఎంట్రీపై స్పందించారు నాగార్జున. అయితే ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టుపై ఇంతకుమించి స్పందించలేనని, దానికింకా చాలా టైమ్ ఉందంటున్నారు. నిజానికి నాగ్ నటించిన వైల్డ్ డాగ్ సినిమా ఓటీటీలోనే రిలీజ్ అవ్వాల్సింది. ఆఖరి నిమిషంలో దాన్ని ఓటీటీ నుంచి వెనక్కి తెచ్చి థియేటర్లలో వేశారు. అలా ఓటీటీ డెబ్యూ మిస్సయిన ఈ సీనియర్ హీరో, అతి త్వరలోనే ఓ ప్రయోగాత్మక చిత్రంతో ఓటీటీలో కనిపించబోతున్నాడు.