వెండితెరపై హిట్స్ ఉండొచ్చు, ఫ్లాపులు కూడా ఉండొచ్చు. కానీ బుల్లితెరపై మాత్రం నాగార్జున కింగ్. అతడు చేసిన షోలు ఏవీ ఫ్లాప్ అవ్వలేదు. అయితే తాజాగా నాగార్జున చేసిన బిగ్ బాస్ సీజన్ 3 మాత్రం అతడి రేంజ్ లో సక్సెస్ అవ్వలేదు.
ఇంకా స్ట్రయిట్ గా చెప్పాలంటే.. సీజన్-3లో నాగార్జునకు పాస్ మార్కులు మాత్రమే పడతాయి. బాస్ సీజన్ -3 ఈ రోజుతో ముగుస్తున్న వేళ.. నాగార్జున యాంకరింగ్ పై ఎక్స్ క్లూజివ్ రిపోర్ట్.
బిగ్ బాస్ షోకు వ్యాఖ్యాతగా నాగార్జున ఎంపికయ్యాడనగానే షో చుట్టూ చాలా బజ్ అల్లుకుంది. అందుకు తగ్గట్టుగానే స్టార్టింగ్ లో టీఆర్పీలు హోరెత్తాయి. స్టార్ మా ఛానెల్ ను నంబర్ వన్ స్థానంలో నిలబెట్టాయి.
అయితే రానురాను నాగార్జున “పనితనం” ప్రేక్షకులకు అర్థమైపోయింది. తనకు తెలిసిన 2-3 ట్రిక్కులతో నాగార్జున కాలక్షేపం చేస్తున్నాడనే విషయాన్ని ఆడియన్స్ ఈజీగానే అర్థం చేసుకున్నారు. దీనికితోడు వంద ఎపిసోడ్ల కార్యక్రమంలో మధ్యలో నాగ్ తీసుకున్న గ్యాప్ అతడికి మరింత మైనస్ గా మారింది.
తన పుట్టినరోజు సందర్భంగా కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్లాడు నాగ్. ఆ టైమ్ లో నాగార్జున స్థానంలో రమ్యకృష్ణ వచ్చింది. ఆమె అడుగుపెట్టేంత వరకు నాగార్జున ఎంత వీక్ అనే విషయం ప్రేక్షకులకు అర్థంకాలేదు. చేసిన 2 ఎపిసోడ్లలోనే రమ్యకృష్ణ చూపించిన హుందాతనం, కంటెస్టెంట్లను ఆమె విశ్లేషించిన విధానం ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఆ తర్వాత తిరిగి నాగార్జున లైన్లోకి వచ్చినప్పటికీ రమ్యకృష్ణ మాత్రం ప్రేక్షకుల మనసుల్లో అలానే ఉండిపోయింది. సరిగ్గా నాగార్జునపై ట్రోలింగ్స్ కూడా అప్పట్నుంచే పీక్ స్టేజ్ కు చేరాయి.
ఇప్పటివరకు 3 సీజన్లు జరిగితే మొదటి సీజన్ లో ఎన్టీఆర్ అదరగొట్టాడు. రెండో సీజన్ లో నాని వ్యాఖ్యాతగా వ్యవహరించి సక్సెస్ అయ్యాడు. మూడో సీజన్ కోసం అడుగుపెట్టిన నాగార్జున.. వాళ్లిద్దర్నీ మరిపిస్తాడని అనుకున్నారంతా.
కానీ 3 సీజన్లు ముగిసేసరికి ఇప్పటికీ ఎన్టీఆరే బెస్ట్ అంటున్నారు చాలామంది. ఆ తర్వాత స్థానాన్ని కొంతమంది నానికి ఇస్తుంటే.. మరికొంతమంది నాగార్జునకు కేటాయిస్తున్నారు. అంతేతప్ప, ఈ మూడు సీజన్లకు కలిపి వ్యాఖ్యాతగా మొదటి స్థానాన్ని నాగ్ కు ఇచ్చే సాహసం మాత్రం ఎవ్వరూ చేయడం లేదు. దీనికి తోడు మహిళా కంటెస్టంట్లను కౌగిలించుకొని, మగ కంటెస్టంట్లను షేక్ హ్యాండ్స్ కే పరిచయం చేయడం కూడా విమర్శలకు తావిచ్చింది.
మరోవైపు తొలిసారిగా ఈరోజు రాత్రి జరగనున్న గ్రాండ్ ఫినాలే లైవ్ ఉంటుందని ప్రకటించాడు నాగార్జున. ఇన్నాళ్లూ రికార్డింగ్ లోనే అంతంతగా మార్కులు తెచ్చుకున్న నాగ్, లైవ్ లో ఎలా పెర్ఫార్మ్ చేస్తాడో చూడాలి.