ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వద్ద టీ కూడా దొరకడం లేదు.. ఇది న్యాయమూర్తులు హైకోర్టులో చేసిన వ్యాఖ్య. జడ్జిలు ఎంతకాలం ప్రైవేటు అతిధి గృహాలలో ఉండాలి. ఇది కూడా న్యాయమూర్తులు అడిగిన ప్రశ్నే. నిజమే వారు చెప్పింది వాస్తవమే. ఆ వెంటనే టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి యనమల రామకృష్ణుడు అందుకున్నారు? హైకోర్టు వద్ద టీ కూడా దొరకడం లేదంటే పరిస్థితి ఏమిటి? అంటూ అమాయకంగా పోజ్ పెట్టి అదేదో ప్రస్తుత ప్రభుత్వం చేసిన తప్పిందంగా చూపించే యత్నం చేశారు. ఇలాంటి జిమ్మిక్కులు చేయడంలో తెలుగుదేశంను మించిన పార్టీ మరకొటి లేదంటే ఆశ్చర్యంకాదు. అయితే ఇక్కడ న్యాయమూర్తులు ఒక సంగతి తెలుసుకోవాలి. అలాగే టీడీపీ వారు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేయాలి.. అదేమిటంటే…
ఏపీలో హైకోర్టు ఏర్పాటు చేయాలన్న అంశం 2014 నుంచి నలిగింది. అప్పట్లో హైకోర్టు చిత్రమైన తీర్పు ఇచ్చింది. ఏపీ భూ భాగంలోనే హైకోర్టు ఏర్పాటు చేయాలి తప్ప, హైదరాబాద్‌లో వేరుగా కాదని ఆదేశించింది. తెలంగాణ ప్రభుత్వం కాని, తెలంగాణ లాయర్లు కాని చాలాకాలం హైకోర్టులు వేరుకాలేదని ధర్నాలు చేశారు. ఆ తర్వాత ఏపీ ప్రభుత్వం రకరకాల లేఖలు రాసింది. ఒకసారి తాము సిద్ధమేనని, ఇంకోసారి కొంత టైమ్ అవసరమని ఇలా రకరకాల ప్రకటనలు చేసింది. ఆ తర్వాత ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. అప్పుడు గత ఏడాది ఆఖరుకల్లా నిర్మాణం పూర్తి చేసుకుని హైకోర్టు తరలి వెళ్లాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దానికి ఏపీ ప్రభుత్వం కూడా ఓకే చేసింది.
తీరా నిర్ణీత గడువు వచ్చాక కూడా భవనం పూర్తికాలేదు. ఈలోగా జడ్జిలు కొందరు వెళ్లి పనులు బాగానే జరుగుతున్నట్లు అభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. తీరా కేంధ్రం తదనుగుణంగా నోటిఫికేషన్ ఇవ్వగానే ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రంపై విరుచుకుపడ్డారు. నానాతిట్లు తిట్టారు. ఆ ప్రహసనం అయ్యాక, విజయవాడలో తాత్కాలికంగా ఒకభవనంలో కోర్టును పెట్టామన్నారు. ఆ పిమ్మట అమరావతి పేరుతో ఉన్న గ్రామాలలో ఒక మూలన స్థానిక కోర్టు కోసం అని కట్టిన భిల్డింగ్లో హైకోర్టు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. దీనికి ఆనాటి ఛీఫ్ జస్టిస్, సీనియర్ జడ్జిలు అంతా వచ్చి ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.
మరి ఆ సమయానికి ఈ నిర్మాణం సరిగా పూర్తికాకపోతే అంత పెద్ద జడ్జిలు ఎలా వచ్చారు. చంద్రబాబు రమ్మనగానే వచ్చారంటే వారు కూడా సరిగా గమనించలేదా? ఇప్పుడు జడ్జిలు వ్యక్తం చేస్తున్న ఇబ్బందులు, సమస్యలను వారు గుర్తించలేదా? కనీసం టీ కూడా దొరకని చోట ఎలా పెట్టారని చంద్రబాబును ఒక్కమాట అడగలేదే? పైగా కేంద్ర న్యాయశాఖ మంత్రితో సంబంధం లేకుండా ప్రారంభోత్సవం జరిగితే అంత పెద్ద జడ్జిలు అంతా ఎలా తరలివచ్చారు? వారిని చంద్రబాబు ఎలా మేనేజ్ చేయగలిగారు? హైకోర్టులో సరైన సదుపాయాలు లేవని లాయర్లు వాపోతున్నారు. కార్ల పార్కింగ్‌కు చోటెక్కడ అని అడుగుతున్నారు? కనీసం లైబ్రరీకి కూడా చోటు లేదట. హైకోర్టు అంటే ముఖ్యమైనది లైబ్రరీ. మరి ఇలాంటి వసతులు లేకుండా హైకోర్టు ఏర్పాటు చేస్తే న్యాయమూర్తులు ఎందుకు ఒప్పుకున్నారో తెలియదు.
అదే పూర్తిస్థాయిలో హైకోర్టు భవనం నిర్మించేవరకు హైదరాబాద్‌లోనే వేర్వేరుగా ఏపీ, తెలంగాణ హైకోర్టులు నడిచే అవకాశం ఉన్నా, ఉమ్మడి రాజధానిగా ఉన్నా ఎందుకు న్యాయమూర్తులు ఆ రకమైన నిర్ణయం చేయలేకపోయారు? ఇది చట్టాలకు సంబంధించిన విషయం కాదు కదా.. కామన్ సెన్స్ పాయింట్ కదా. ఇక తెలుగుదేశం నేత యనమల స్టేట్మెంట్కు వద్దాం. హైకోర్టుకు తాత్కాలిక భవనం కట్టి అద్దాలు పెడితే అంతా బాగుందని లాయర్లు, జడ్జిలు మురిసిపోతారనుకుని ఆనాటి ప్రభుత్వం వ్యవహరించిందా?
అసలు పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉండవలసిన హైదరాబాద్‌ను వదలుకుని ఓటుకు నోటు కేసులో పట్టుబడి అన్ని వర్గాలను నరకయాతన చూపించిన ఘనత చంద్రబాబుది కాదా? హైకోర్టు భవనం కట్టకముందే కట్టేసినట్లు కేంద్రానికి లేఖ రాసింది చంద్రబాబు ప్రభుత్వం కాదా? అప్పుడు అవునవును అని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చప్పట్లు కొట్టలేదా? జనం అంతా ఆశ్చర్యపోలేదా? అసలు బిల్డింగ్ లేకుండా న్యాయమూర్తులను మోసం చేసింది వాస్తవమా? కాదా? దానికి చంద్రబాబుతో యనమల భాగస్వామి కాదా? హైకోర్టు వద్ద టీడీపీ హయాంలో టీ దొరికి ఇప్పుడు దొరకకుండా పోయిందా?
టీడీపీ హయాంలో బిల్డింగ్‌లో నీరు రాకుండా, ఇప్పుడు వస్తోందా? టీడీపీ హయాంలో అన్ని వసతులు ఉంటే, ఇప్పుడు వాటిని వైసీపీ ప్రభుత్వం లేకుండా చేసిందా? జడ్జిలకు టీడీపీ ప్రభుత్వం బంగళాలు కట్టిస్తే, వైసీపీ ప్రభుత్వం వాటిని కాదని ప్రైవేటు అతిధి గృహాలలో ఉండమని చెప్పిందా? ఏమాత్రం విజ్ఞత లేకుండా యనమల వంటి సీనియర్లు మాట్లాడితే ఏమని చెప్పాలి? తమ హయాంలో ఇవన్నీ చేయలేకపోయాం. కొంతవరకే చేశాం. మీరు చేయండి అని చెబితే తప్పులేదు. అలాకాకుండా ఇప్పుడు ఎదువుతున్న అసౌకర్యాలకు అన్నిటికి జగన్ ప్రభుత్వం కారణం అన్నట్లు మాట్లాడి, తమ అద్వాన్న పరిస్థితిని వారు బయటపెట్టుకుంటున్నారు.
ఇక ప్రస్తుత ప్రభుత్వం గురించి మాట్లాడుకుందాం. నిజమే ఏది శాశ్వతంగా కాకుండా తాత్కాలిక భవనాలు కట్టినమాట నిజం. అయినప్పటికీ ఇప్పుడు బాధ్యతలో ఉన్నందున వీటన్నిటి గురించి ఆలోచించవలసిన పరిస్థితి ముఖ్యమంత్రి జగన్‌పై ఉంటుంది. హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేయాలన్న డిమాండ్ కూడా ఉంది. అసలు హైకోర్టు పైన అయినా మరొకటి అయినా, స్పష్టత ఎంతవేగంగా తెచ్చుకుంటే అంత మంచిది. ఈలోగా జడ్జిలకు అవసరమైన సదుపాయాలు, లాయర్లకు కావల్సిన వసతులు, కక్షీదారులకు ఇబ్బందులు లేకుండా చేయడం వంటివాటిని చూడవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది.
చంద్రబాబు ప్రభుత్వం అద్వాన్నంగా చేసిందని చూస్తూ కూర్చుంటే కుదరదు కదా.. చంద్రబాబు చెప్పినట్లు జస్టిస్ సిటీ అని పెద్ద, పెద్ద పదాల గారడి అవసరం లేదు. కచ్చితంగా ఏవి అవసరమో తక్షణమే ప్రభుత్వం స్పందించి చర్యలు చేపట్టాలి. ఎందుకంటే రోజులు గడిచేకొద్దీ ఈ బాధ్యత అంతా ఇప్పుడు ఉన్న ప్రభుత్వంపైనే పడుతుంది. ఆ ప్రభుత్వం చేయకపోతే, మీరేం చేశారన్న ప్రశ్న వస్తుంది. న్యాయమూర్తులకు ఇవన్నీ తెలియవని కావు. కాని వారి బాధ వారిది. అందువల్ల జగన్ ప్రభుత్వం సకాలంలో దీనిపై స్పందించడం మంచిదని చెప్పాలి.
-కొమ్మినేని శ్రీనివాసరావు