సమంతతో తన కుమారుడు నాగచైతన్య విడాకులపై హీరో నాగార్జున ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటిగా మాట్లాడుతున్నారు. బంగార్రాజు సినిమాలో తండ్రీకొడుకు కలిసి నటించి ప్రేక్షకుల్ని అలరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వివిధ మీడియా సంస్థలకు వరుస ఇంటర్వ్యలు ఇస్తూ సమంతతో నాగచైతన్య విడిపోవడానికి దారి తీసిన పరిస్థితులపై నాగార్జున నోరు విప్పుతున్నారు.
తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. అసలు వాళ్లిద్దరి మధ్య విడిపోవాల్సినంత సమస్య కూడా ఏదీ లేదని ఆయన తెలిపారు. కేవలం విడిపోవాలన్న సమంత అభిప్రాయాన్ని గౌరవించేందుకే చై అంగీకరించారని చెప్పుకొచ్చారు.
నాగచైతన్యతో సమంత విడిపోవాలనే నిర్ణయానికి వచ్చి…. ఈ మేరకు ప్రయత్నాలు మొదలు పెట్టిందన్నారు. అయితే సమంత తీసుకున్న నిర్ణయాన్ని కేవలం గౌరవించి మాత్రమే చై అంగీకరించారన్నారు. నిజానికి వాళ్లిద్దరూ చాలా ప్రేమగా ఉండేవారని ఆయన గుర్తు చేశారు. నాలుగేళ్ల వైవాహిక జీవితంలో విడిపోయేంత సమస్య వాళ్లిద్దరి మధ్య తనకు తెలిసి లేదని నాగార్జున చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది.
గత ఏడాది కొత్త సంవత్సరం వేడుకలను సమంత-చై కలిసి ఎంతో సంతోషంగా జరుపుకున్నారని నాగార్జున వెల్లడించారు. ఆ తర్వాతే వాళ్లిద్దరి మధ్య ఏదో సమస్య వచ్చిందన్నారు. అదేంటనేది తనకూ తెలియదన్నారు. సమంతే విడిపోవాలని నిర్ణయం తీసుకుని అప్లయ్ చేసిందని నాగ్ చెప్పుకొచ్చారు. అందుకు చై అంగీకరించారని తెలిపారు.
కానీ తన గురించే చైతన్య ఎక్కువగా బాధపడ్డారని వాపోయారు. విడాకుల విషయాన్ని తాను ఎలా తీసుకుంటానో అనే బాధ చైలో కనిపించిందన్నారు. కుటుంబ పరువు, మర్యాద ఏమైపోతుందోనన్న ఆలోచన, ఆవేదన తన కుమారుడిలో ఎక్కువ కనిపించినట్టు నాగార్జున చెప్పుకొచ్చారు. సమంతతో విడాకుల విషయమై వ్యూహాత్మకంగా అక్కినేని కుటుంబం తెరపైకి తీసుకొస్తున్నట్టు నాగార్జున వరుస ఇంటర్వ్యూలు ప్రతిబింబిస్తున్నాయి.