ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బిగ్‌బాస్ రియాల్టీ షో సీజన్-4 వచ్చే నెలలో ప్రారంభం కానుంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ దఫా ప్రోగ్రామ్ షెడ్యూల్‌ను కుదించినట్టు సమాచారం. మామూలుగా అయితే వంద రోజులు సాగాల్సి ఉంది. గత మూడు సీజన్లు వంద రోజులకు తగ్గకుండా నడిచాయి. ఈ దఫా మాత్రం మహా అయితే 50-60 రోజులకు మించి బిగ్‌బాస్ రియాల్టీ షో కొనసాగే పరిస్థితి లేదంటున్నారు.
ఇది ఇలా ఉండగా నాలుగో సీజన్‌కు కూడా హోస్ట్‌గా హీరో నాగార్జున వ్యవహరించనున్నారు. కరోనా మహమ్మారిని దృష్టిలో పెట్టుకుని నాగ్ కొన్ని కండీషన్స్ పెట్టినట్టు సమాచారం. ముఖ్యంగా షూటింగ్ లోకేషన్‌లో తక్కువ మంది ఉండాలని, అలాగే కంటెస్టెంట్స్‌తో నేరుగా ఇంటరాక్షన్ ఉండొద్దనే నిబంధన పెట్టారని తెలిసింది.
ఇక హోస్ట్ నాగార్జునకు కూడా బిగ్‌బాస్ టీం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోందని సమాచారం. నాగార్జున కోసం ప్రత్యేక గదిని ఏర్పాటు చేయనున్నారని తెలిసింది. అంతేకాదు గతంలో మాదిరిగా వారంలో రెండుసార్లకు బదులు ఒక్కరోజు మాత్రమే ఆయన తెర మీద కనిపించనున్నారు. గతంలో శని, ఆదివారాల్లో హోస్ట్ అలరించేవారు. మిగిలిన రోజుల్లో ప్రత్యేక సెలబ్రిటీలతో బిగ్‌బాస్ షోను రక్తి కట్టించేందుకు పథక రచన చేస్తున్నారు.