అడల్ట్ కంటెంట్ కాసులు కురిపిస్తుంది కానీ వివాదాలకి కూడా కారణమవుతుంది. కబీర్ సింగ్ రెండువందల యాభై కోట్ల నెట్ వసూళ్లని ఇండియాలో సాధించినా కానీ ఒకవర్గం చేత చీవాట్లు పెట్టించుకుంటోంది. విమర్శకులే కాకుండా జనరల్ పబ్లిక్‌లో ఒక వర్గం కూడా దీనికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. షాహిద్ కపూర్ అద్భుతమైన అభినయం కనబరచినా కానీ కబీర్‌సింగ్ కాంటెంట్, ఐడియాలజీని జనం తప్పుబడుతున్నారు.
కబీర్ సింగ్‌ని తిట్టిపోసే వాళ్లలో సింగర్ చిన్మయి శ్రీపాద కూడా చేరింది. మన్మథుడు 2 డైరెక్ట్ చేస్తోన్న రాహుల్ రవీంద్రన్ భార్య అయిన చిన్మయి 'కబీర్‌సింగ్' చిత్ర దర్శకుడు సందీప్ వంగా ఆలోచనలని ఎండగట్టింది. ఆమెకి సమంత అక్కినేని వంత పాడింది. దీంతో కబీర్‌సింగ్ అభిమానులు వారిపై దాడి మొదలుపెట్టారు. ఈ క్రమంలో 'మన్మథుడు 2' కాంటెంట్ చర్చకి దారితీసింది. అరవయ్యేళ్ల నాగార్జునతో ఆయన వయసులో సగం కూడా లేని రకుల్ నటించడం ఏమిటి అని ప్రశ్నించడంతో పాటు మన్మథుడు ట్రెయిలర్స్‌లోను డైలాగ్స్, సీన్స్‌ని కూడా ట్రోల్ చేస్తున్నారు.
అనూహ్యంగా మన్మథుడు 2 కూడా కబీర్‌సింగ్ చర్చలోకి చేరిపోవడంతో పాటు చిన్మయిని కార్నర్ చేయడానికి ట్రోల్స్‌కి ప్రధాన ఆయుధంగా మారింది. దీంతో సినిమా విడుదలైన తర్వాత ట్రోలింగ్ మరింత ఎక్కువయ్యే ప్రమాదం వుందని గ్రహించిన నాగార్జున 'మన్మథుడు 2'లో డబుల్ మీనింగ్ డైలాగులు, కాస్త ఘాటైన సన్నివేశాలు తొలగించాలని దర్శకుడు రాహుల్‌కి ఆర్డర్ వేసినట్టు తెలిసింది.