తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)పై సినీనటి నమిత “భౌభౌ” అన్నారు. ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆమె టీటీడీపై తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేయడం విశేషం. టీటీడీ ఉన్నతాధికారులను ఇరుకున పెట్టేలా ఆమె విమర్శలున్నాయి. దీంతో ప్రతిపక్షాలకు సినీనటి వ్యాఖ్యలు ఓ ఆయుధం ఇచ్చినట్టైంది.
జెమిని, సింహా, బిల్లా లాంటి సినిమాల్లో నటించిన నమిత టాలీవుడ్ ప్రేక్షకులను అలరించారు. అయితే టాలీవుడ్‌లో ఎక్కువ అవకాశాలు రాకపోవడంతో తమిళనాడుకు మకాం మార్చారామె. ఈ నేపథ్యంలో ఆమె భౌభౌ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు ఆమె చెప్పారు.
ఇదిలా వుండగా శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం నమిత మీడియాతో మాట్లాడారు. భక్తులకు టీటీడీ సంతృప్తికరమైన దర్శనం కల్పించడం లేదని అన్నారు. టీటీడీలో ప్రస్తుతం పరిపాలన బాగోలేదని ఆరోపించారు.
గతంలో ఉన్న అధికారి నేతృత్వంలో తిరుమలలో పరిపాలన బాగుందని చెప్పుకొచ్చారు. టీటీడీ ఉద్యోగులంతా భయందోళనలో ఉన్నారని నమిత ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు తిరుమలలో నమిత కోరుకున్నట్టుగా దర్శనం కాలేదని ఆవేదనతో అలా మాట్లాడి ఉంటారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేవుని దర్శనానికి వచ్చి విమర్శలేంటి? అని ప్రశ్నించే వాళ్లు లేకపోలేదు.
అలాగే నమిత థియేటర్ పేరుతో ఓటీటీ యాప్, నిర్మాణ సంస్థను ప్రారంభించినట్టు ఆమె వెల్లడించారు. థియేటర్లలో విడుదల చేయాలా ? వద్దా ? లేదా ఓటీటీలో చేయాలా అనేది నిర్ణయం తీసుకోలేదన్నారు. దానిపై చర్చలు జరుగుతున్నాయని ఆమె వివరించారు. త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటామని నమిత స్పష్టం చేశారు.