తన మానాన తాను ఫామ్ హౌజ్ లో ఉంటూ పాలన సాగిస్తున్నారు కేసీఆర్. ఎలాంటి హంగామా లేకుండా స్తబ్దుగా కార్యక్రమాలు సాగిపోతున్నాయి. ఫామ్ హౌజ్ పాలన అంటూ ఎవరెన్ని అనుకున్నా కేసీఆర్ లెక్క చేయలేదు, జనాలను కలవాలని అనుకోలేదు. అలా కామ్ గా సాగిపోతున్న కేసీఆర్ ను విపక్షాలు కోరి కెలికాయి. దాదాపు ఏడాది పాటు రెచ్చగొట్టాయి.
దుబ్బాక ఉప ఎన్నిక ఇచ్చిన విజయోత్సాహంతో బీజేపీ మరింత రెచ్చిపోయింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మరింత హడావిడి చేసింది. బీజేపీ రెచ్చిపోవడంతో కేసీఆర్ కాస్త స్పృహలోకి వచ్చారు. ఫామ్ హౌజ్ బయటకి వచ్చిన ఆయన ఇప్పుడు రాష్ట్రమంతా కలియదిరుగుతున్నారు. అసలు కేసీఆర్ ని ఎందుకు కెలికామా అంటూ ప్రతిపక్షాలు కిందామీదా పడుతున్నాయంటే.. ఆయన విశ్వరూపం ఏ స్థాయిలో చూపిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
రాజకీయ చతురుడు, మంచి వ్యూహకర్త కేసీఆర్. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్, మద్దతిచ్చిన బీజేపీని కాదని తెలంగాణలో వరుసగా రెండు దఫాలు టీఆర్ఎస్ జెండా రెపరెపలాడేలా చేశారంటే దానికి కారణం ఆయన వ్యూహ చతురత, మాటకారితనం. అలాంటి కేసీఆర్ అధికారంలోకి వచ్చాక మాత్రం ప్రజల్ని పట్టించుకోరనే అపవాదు ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వం మొదటి ఫేజ్ లో ఇదే జరిగింది.
ప్రతిపక్షాలు అభివృద్ధికి అడ్డుపడుతున్నాయంటూ ప్రభుత్వాన్ని రద్దు చేసి మరీ 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లారు కేసీఆర్. రెండోసారి అధికారంలోకి వచ్చాక కూడా చాన్నాళ్లు మంత్రిమండలి లేకుండా పాలన సాగించి తన హవా చూపారు. దుబ్బాక షాక్ తర్వాత తిరిగి చెలరేగిన కేసీఆర్.. ఇప్పుడు మరింత దూకుడుమీదున్నారు.
ఆ దూకుడు ముందు విపక్షాల విమర్శలు, ఎత్తుగడలు నిలవడం లేదు. ఒకరకంగా ఈటల ఎపిసోడ్ తర్వాత కేసీఆర్ మరింత అలర్ట్ అయ్యారు. ఈటల ప్రభావం టీఆర్ఎస్ పై అస్సలు లేదు అనే స్థాయిలో, తన పర్యటనలతో సీన్ మొత్తం మార్చేశారు కేసీఆర్.
కరోనా పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు గాంధీ ఆస్పత్రిని సందర్శించిన కేసీఆర్ ఒక్కసారిగా ప్రతిపక్షాలకు షాకిచ్చారు. అప్పటి వరకూ ఏ రాష్ట్ర సీఎం కూడా అలా ఐసీయూలలోకి దూసుకెళ్లలేదు. ఆ తర్వాత వరంగల్ ఆస్పత్రిలో కూడా అదే తంతు. పేషెంట్లను చేయిపట్టుకుని మరీ పరామర్శించి వచ్చాకు కేసీఆర్. ఆ తర్వాత వరుసబెట్టి పర్యటనలు చేస్తున్నారు.
హామీలు ఇస్తున్నారు, వాటిని తక్షణం అమలులోకి వచ్చేలా చేస్తున్నారు. సహపంక్తి భోజనాలు చేస్తున్నారు. మున్సిపాల్టీలకు, గ్రామాలకు నిధుల వరద పారిస్తున్నారు. సొంత పార్టీ నేతలకే అపాయింట్ మెంట్లు ఇవ్వరనే అపవాదు ఉన్న కేసీఆర్, అఖిలపక్షంతో సమావేశం కావడం మరీ విచిత్రం.
ఇప్పుడిక ఉద్యోగాల భర్తీపై పడ్డారు కేసీఆర్. 50వేల ఉద్యోగాలిస్తామంటూ ఊరిస్తున్నారు. ఆ మాట నిలబెట్టుకుంటే, వైఎస్సార్టీపీ అధినేత షర్మిల విమర్శనాస్త్రాలు కూడా ఇకపై పనిచేయవేమో. ఒకరకంగా విపక్షాలకు ఊపిరాడకుండా చేస్తున్నారు కేసీఆర్. ఇదే ఊపును 2023 వరకు కొనసాగిస్తే మాత్రం బీజేపీ, కాంగ్రెస్ కి మరోసారి భారీ నష్టం జరగడం ఖాయం.