తిట్టించుకోడానికే రేవంత్ ఆ పదవి తీసుకున్నారా..?

తెలంగాణలో కాంగ్రెస్ ని ఉద్దరిద్దామనే ఉద్దేశంతో టీపీసీసీ పదవి తీసుకున్నారు రేవంత్ రెడ్డి. అయితే ఆయన అనుకున్నదొకటి, అయింది మరొకటి. టీపీసీసీ పదవి లేకపోయినా బాగుండేదేమో అనే పరిస్థితికి వచ్చారు రేవంత్.  Advertisement సొంత…

తెలంగాణలో కాంగ్రెస్ ని ఉద్దరిద్దామనే ఉద్దేశంతో టీపీసీసీ పదవి తీసుకున్నారు రేవంత్ రెడ్డి. అయితే ఆయన అనుకున్నదొకటి, అయింది మరొకటి. టీపీసీసీ పదవి లేకపోయినా బాగుండేదేమో అనే పరిస్థితికి వచ్చారు రేవంత్. 

సొంత పార్టీలోనే ఆయనకు శత్రువులు ఎక్కువయ్యారు. 'బ్రీఫ్డ్ మీ' కేసు వ్యవహారం బయటకు తీసి పరువు తీస్తున్నారు. సూట్ కేసులతో ఢిల్లీ వెళ్లి పదవి తెచ్చుకున్నారని ఆల్రడీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ ని మరీ చీప్ గా తీసిపారేశారు.

ఆ తర్వాత ఏబీఎన్ రాధాకృష్ణతో జరిపిన మంతనాల్లో నారా లోకేష్ పేరు జపించి మరింత మంది కాంగ్రెస్ వాదులకు టార్గెట్ అయ్యారు రేవంత్. టీడీపీ నుంచి వచ్చినా పాత వాసనలు పోలేదనే విమర్శలు ఎదుర్కొంటున్నారు.

రేవంత్ పరువు తీస్తున్న కేటీఆర్..

ఒకప్పుడు సోనియాని తెలంగాణ మృత్యుదేవత అన్న రేవంత్, అదే నోటితో ఇప్పుడామెను తెలంగాణ తల్లి అంటున్నారు. ఆ దేవతను కేసీఆర్ మోసం చేశారని, పార్టీని విలీనం చేస్తానని చెప్పి మాటిచ్చి తప్పారని నోటికొచ్చినట్టు చెబుతున్నారు. సోనియాను తెలంగాణ దేవత అన్న రేవంత్, అదే ఫ్లోలో చంద్రబాబుని తెలంగాణ దేవుడని కూడా అంటారంటూ కేటీఆర్ అదిరిపోయే పంచ్ విసిరారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ కి అమ్ముడుపోయారని చెబుతున్న రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో సూట్ కేసులు మోసి అడ్డంగా బుక్కైన విషయం అందరికీ తెలుసంటూ మరో సెటైర్ పేల్చారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంది. ఒకరకంగా కేసీఆర్ ని కదిలించి.. టీఆర్ఎస్ నేతలకు అడ్డంగా బుక్కయ్యారు రేవంత్. ముఖ్యంగా కేటీఆర్ టీజింగ్ తట్టుకోలేకపోతున్నారు.

సహజంగా ఏ రాష్ట్రం నేతల్ని, ఆ రాష్ట్రంలోని వైరిపక్షాలు తిట్టడం కామన్. కానీ రేవంత్ కి పదవి వచ్చిన వేళా విశేషం.. పక్క రాష్ట్రం నేతలు కూడా చెడామడా వాయించేస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యే రోజా ఇంట్లో కేసీఆర్ భోజనం చేశారని, నీటివాటాల గురించి ఒప్పందాలు చేసుకున్నారని నోరు జారిన రేవంత్ కి చీవాట్లు బాగానే పడ్డాయి. 

రేవంత్ రెడ్డి.. కోవర్ట్ రెడ్డి అంటూ రోజా చెడామడా వాయించేశారు. టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లి.. చంద్రబాబుకి కోవర్టులా పనిచేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు రోజా. ఒకరకంగా రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి వచ్చిన తర్వాతే బ్యాడ్ టైమ్ మొదలైనట్టు అర్థమవుతోంది. 

ఇటు వైరిపక్షాలు, ఇటు స్వపక్షం… రెండువైపులా రేవంత్ కి బ్యాండ్ మోగిపోతోంది. ఇంకా హుజూరాబాద్ లో కాలుమోపలేదు కాబట్టి, బీజేపీ వేచి చూసే ధోరణిలో ఉంది. ఉప ఎన్నికల వ్యవహారం రసవత్తరంగా మారితే మాత్రం బీజేపీ కూడా రేవంత్ పై విరుచుకుపడటం ఖాయం.