ఇచ్చిన మాట నిలబెట్టుకున్న గ్యాంగ్ లీడర్

కొన్నేళ్ల కిందటి సంగతి. గ్యాంగ్ లీడర్ అనే సినిమా చేశాడు నాని. ఆ సినిమాతోనే టాలీవుడ్ కు పరిచయమైంది హీరోయిన్ ప్రియాంక మోహన్. ఆ సినిమా ప్రమోషన్స్ లో మాట్లాడుతూ.. ప్రియాంక యాక్టింగ్ కు…

కొన్నేళ్ల కిందటి సంగతి. గ్యాంగ్ లీడర్ అనే సినిమా చేశాడు నాని. ఆ సినిమాతోనే టాలీవుడ్ కు పరిచయమైంది హీరోయిన్ ప్రియాంక మోహన్. ఆ సినిమా ప్రమోషన్స్ లో మాట్లాడుతూ.. ప్రియాంక యాక్టింగ్ కు తను ఫిదా అయ్యానని, కచ్చితంగా ఆమెతో మరో సినిమా చేస్తానని నాని అప్పట్లో ప్రకటించాడు.

ఇక 'అంటే సుందరానికి' విషయానికొద్దాం.. వివేక్ ఆత్రేయ ఈ సినిమాకు దర్శకుడు. వివేక్ స్కిల్స్ నానీని కట్టిపడేశాయి. ఆ సినిమా విడుదలై మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్న తర్వాత కూడా వివేక్ కు తన మద్దతు తెలిపాడు నాని. అతడితో కచ్చితంగా మరో సినిమా చేస్తానని ప్రకటించాడు.

ఇప్పుడీ రెండు వాగ్దానాల్ని ఒకేసారి నిలబెట్టుకున్నాడు ఈ హీరో. త్వరలోనే తన 31వ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు ఈ హీరో. ఈ ప్రాజెక్టుకు వివేక్ ఆత్రేయ దర్శకుడు కాగా.. ఇందులో హీరోయిన్ గా ప్రియాంక మోహన్ ను తీసుకున్నారు. ఈరోజు ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించారు.

సినిమాకు సంబంధించి చిన్న వీడియోను సిద్ధం చేస్తున్నారు. 23న వీడియో లేదా పోస్టర్ ను రిలీజ్ చేసి, 24న సినిమాకు కొబ్బరికాయ కొట్టబోతున్నారు. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రాబోతోంది ఈ మూవీ.

ఇంతకుముందు నాని-ఆత్రేయ కలిసి పూర్తి వినోదాత్మకంగా 'అంటే సుందరానికీ' సినిమా తీశారు. ఈసారి వీళ్లు మరో జానర్ ట్రై చేస్తున్నారు. ఈ సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు ఫన్ కూడా ఉంటుందని ప్రకటించింది నిర్మాణ సంస్థ. ఈ సినిమా కోసమే తమిళ నటుడు కమ్ డైరక్టర్ ఎస్ జే సూర్యను ట్రై చేస్తున్నారు.