నాని సిస్టర్ దీప్తి దర్శకురాలిగా మారారు. తన సోదరి సినిమాను నాని స్వయంగా నిర్మిస్తున్నాడు. ఆ మూవీ ఈరోజు అఫీషియల్ గా లాంఛ్ అయింది. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై దీప్తి గంటా దర్శకురాలిగా పరిచయమౌతూ రాబోతున్న ఆ సినిమా పేరు ''మీట్ క్యూట్''.
తన బ్యానర్ పై కొత్తగా ఉండే కథల్ని మాత్రమే సినిమాలుగా తీస్తానని ప్రకటించాడు నాని. ఇప్పటివరకు తీసిన 2 సినిమాలు అలాంటివే. ఈ రోజు లాంఛ్ అయిన ''మీట్ క్యూట్'' కూడా ఆ కోవలోకే వస్తుందంటున్నాడు ఈ హీరో.
ఈ సినిమా ఓ మల్టీస్టారర్. అంటే హీరోల మల్టీస్టారర్ కాదు, హీరోయిన్ల మల్టీస్టారర్. ప్రముఖ హీరోయిన్లు ఇందులో లీడ్ రోల్స్ చేయబోతున్నారు. ఎంతమందనేది త్వరలోనే తెలుస్తుంది. ప్రస్తుతానికైతే నటుడు సత్యరాజ్ పై మాత్రమే నాని క్లాప్ కొట్టాడు. హీరోయిన్ల పేర్లు బయటపెట్టలేదు.
30-35 రోజుల్లో ఈ సినిమాను పూర్తిచేయాలనేది నాని ప్లాన్. దానికి తగ్గట్టే సెటప్ అంతా పెట్టుకున్నాడు. సినిమాకు భారీ సెట్ వర్క్ లాంటి హంగుల్లేవు. విజయ్ బుల్గానిన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తాడు. నాని బ్యానర్ పై వస్తున్న నాలుగో సినిమా ఇది. మూడో చిత్రం హిట్-2 ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది.