కరోనా తర్వాత టాలీవుడ్ లో రెమ్యూనరేషన్లు తగ్గుతాయన్నారు. ప్రొడక్షన్ కాస్ట్ కూడా తగ్గుతుందని అంచనాలు కట్టారు. కానీ దీనికి విరుద్ధంగా మహేష్, పవన్, అల్లు అర్జున్ లాంటి హీరోలు తమ పారితోషికాలు సవరించారు. ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పుడు బలి పశువులైంది ఎవరంటే కేవలం మీడియం రేంజ్ హీరోయిన్లు, మిడ్-రేంజ్ టెక్నీషియన్లు మాత్రమే. వీళ్ల విషయంలో ఇప్పుడు చింతపండు బేరాలు సాగుతున్నాయి. మరీ చీప్ గా నిర్మాతలు బేరసారాలు సాగిస్తున్నారు.
ఓ హీరోయిన్ మొన్నటివరకు 75 లక్షలు తీసుకునేది. అది కూడా పాపం, ఆమధ్య వచ్చిన ఓ హిట్ వల్ల పెరిగిన పారితోషికం. ఆ మాస్ సినిమా సక్సెస్ తో వరుస ఫ్లాపులతో ఉన్న హీరో లైమ్ లైట్లోకి వచ్చాడు. అప్పటివరకు సక్సెస్ లేని మ్యూజిక్ డైరక్టర్ కూడా క్లిక్ అయ్యాడు. వాళ్లు రేట్లు పెంచారు. వాళ్లతో పాటు ఈ ముద్దుగుమ్మ కూడా పాతిక లక్షలు పెంచింది. కట్ చేస్తే, కరోనా తర్వాత సదరు సంగీత దర్శకుడు, హీరో రేట్లు అలానే ఉన్నాయి కానీ, ఈ అమ్మాయికి మాత్రం పెంచిన పాతిక కోతేశారు. మళ్లీ 50 లక్షలకే ఓ కొత్త సినిమా ఒప్పుకుంది.
మరో హీరోయిన్ పరిస్థితైతే మరీ ఘోరం. ప్రస్తుతం ఆమె ఒకే హీరోతో 2 సినిమాలు చేస్తోంది. అంతోఇంతో క్రేజ్ కూడా ఉంది. ఓ బడా నిర్మాత అండదండలు కూడా ఉన్నాయి. కానీ పారితోషికం విషయంలో ఇవేవీ పనికిరావట్లేదు. మొన్నటివరకు 80 లక్షలు తీసుకున్న ఆ హీరోయిన్ కు ఇప్పుడు 50కి మించి ఇవ్వమంటున్నారు నిర్మాతలు.
కాస్తోకూస్తో క్రేజ్ ఉన్న భామలకే ఇలా ఉందంటే.. ఇక ఫ్లాపు హీరోయిన్ల పరిస్థితి ఊహించుకోవడమే కష్టం. రీసెంట్ గా ఓ స్పోర్ట్స్ బేస్డ్ సినిమాలో నటించిన ఓ హీరోయిన్, ఆ తర్వాత మరో ఫ్లాప్ అందుకుంది. దీంతో ఆమెకు అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. ప్రస్తుతం ఆ హీరోయిన్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే.. ఓ సినిమా కోసం 40 లక్షలకు మించి పైసా కూడా ఇవ్వనని ఓ నిర్మాత తెగేసి చెప్పేశాడు. ఆమె నో చెబితే.. 30 లక్షలకే ఆ సినిమా చేసేందుకు మరో ఇద్దరు ఫ్లాప్ హీరోయిన్లు రెడీగా ఉన్నారు మరి.
14 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటూ, టాప్ హీరోయిన్ గా చలామణి అవుతున్న ఓ అమ్మాయి కూడా పారితోషికం తగ్గించుకోవాల్సి వచ్చింది. ఓ పెద్ద సీనియర్ హీరో సరసన బడా సినిమా చేస్తున్న ఈ ముద్దుగుమ్మ, తన నెక్ట్స్ సినిమాల కోసం 15 లక్షల వరకు తగ్గించుకుంది. ఆమెకిప్పుడు డబ్బు సమస్య కాదు, అవకాశాలు రావడం ముఖ్యం. ఏదో ఒక సినిమా ఛాన్స్ రావాలి, ఎంతోకొంత వెనకేసుకోవాలి. అదీ ఆమె టార్గెట్.
ఓవైపు చాలామంది హీరోయిన్ల పరిస్థితి ఇలా ఉంటే, మరోవైపు ఇద్దరు ముగ్గురు ముద్దుగుమ్మలు మాత్రం రెండు చేతులతో సంపాదిస్తున్నారు. పూజా హెగ్డే, సమంత, రష్మిక లాంటి వాళ్లు ఈ కోవలోకి వస్తారు. వీళ్ల దగ్గర బేరాల్లేవు. అడిగినంత ఇచ్చుకోవాల్సిందే, కాల్షీట్లు పుచ్చుకోవాల్సిందే. క్రేజ్ ఉంటే కరోనా కూడా బలాదూర్ అనడానికి వీళ్లు ఎగ్జాంపుల్స్. పాపం మిగతా వాళ్లు మాత్రం పారితోషికాలు తగ్గించుకోవాల్సి వస్తోంది.