తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ టీఆర్ఎస్, బీజేపీలతో దాగుడుమూతలాట ఆడుతున్నారా? అంటే, ఔననే సమాధానం వస్తోంది. ఇప్పటికే తాను టీఆర్ఎస్‌లో చేరేందుకు నిర్ణయించుకోవడం బహిరంగ రహస్యం. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ, పదవులపై భరోసా ఇస్తే… ఏ క్షణాన్నైనా జంప్ చేసేందుకు ఎల్.రమణ సిద్ధంగా ఉన్నారనే అభిప్రాయాలు విస్తృతంగా వ్యాపించాయి.
మరోవైపు ఈ రోజు (సోమవారం) జగిత్యాలలో తన అనుచరులతో ఆయన కీలక సమావేశం నిర్వహించారు. టీఆర్ఎస్‌లో చేరికపై అభిప్రాయాలు సేకరించారు. నాయకుడు నిర్ణయించుకున్న తర్వాత, మిగిలిన వారి అభిప్రాయాలు అంతా మొక్కుబడి వ్యవహా రమే అనేది అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో తన కార్యకర్తలు, నాయకులతో ఎల్.రమణ భేటీ కావడం కూడా అలాంటిదే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సస్పెన్షన్‌ను మరింత కొనసాగించారు.
రాష్ట్ర రాజకీయాల్లో ఊహించని మార్పులొస్తున్నాయని ఎల్.రమణ చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో తనను టీఆర్ఎస్, బీజేపీ ఆహ్వానించాయన్నారు. ఇప్పుడు తాను పదవుల కోసం ఆశించి ప్రతిపాదనలు చేసినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
టీఆర్ఎస్, బీజేపీలు తనకు ఎలాంటి ప్రతిపాదనలు చేయలేదన్నారు. తాను కూడా వారికి ఏమీ చెప్పలేదన్నారు. పదవుల కోసం పాకులాడే మనిషిని కాదన్నారు. ప్రజాజీవితంలో మరింత ముందుకెళ్లేందుకు మంచి నిర్ణయంతో రావాలని పలువురు కోరుతున్నారని చెప్పారు. రెండు పార్టీల ఆహ్వానంపై స్థానికంగా ఉన్న నేతలు, కార్యకర్తలతో చర్చిస్తున్నట్టు రమణ చెప్పారు.
పదవులపై ఆశ లేకపోతే, టీఆర్ఎస్, బీజేపీలకు ఎలాంటి ప్రతిపాదనలు పెట్టలేదనే మాటల్లో నిజమే ఉంటే, ఇక పార్టీ మారాలనే ఆలోచన ఎందుకనేది టీడీపీ శ్రేణుల ప్రశ్న. పదవుల ప్రస్తావనే లేనప్పుడు టీడీపీలోనే కొనసాగవచ్చు కదా అని రాజకీయ విశ్లేషకుల నిలదీతలు. చల్లకొచ్చి ముంత దాచడం అంటే ఇదేనని, టీఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయించుకుని ….ఇప్పుడీ నీతి వాక్యాలు దేనికని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.