డబుల్ బెడ్ రూమ్.. మోసానికి మరో మార్గం

మొన్నటికిమొన్న కేసీఆర్ పీఏనంటూ చెప్పుకున్న ఓ వ్యక్తి వైట్ కాలర్ మోసానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఓ జ్యోతిష్కుడి నుంచి ఏకంగా పాతిక లక్షలు కొట్టేశాడు ఆ నకిలీ పీఏ. ఆ ఘటనను మరిచిపోకముందే,…

మొన్నటికిమొన్న కేసీఆర్ పీఏనంటూ చెప్పుకున్న ఓ వ్యక్తి వైట్ కాలర్ మోసానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఓ జ్యోతిష్కుడి నుంచి ఏకంగా పాతిక లక్షలు కొట్టేశాడు ఆ నకిలీ పీఏ. ఆ ఘటనను మరిచిపోకముందే, అలాంటిదే మరో ఘటన హైదరాబాద్ లో కలకలం రేపింది. ఈసారి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఎరగా చూపి మోసానికి పాల్పడింది ఓ ముఠా.

కేసీఆర్ సర్కారు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పథకం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల స్కీమ్. ఈ పథకం కింద డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇప్పిస్తామంటూ ఆర్.సి.పురంలో ఓ ముఠా రంగంలోకి దిగింది. తమకు సెక్రటేరియట్ లో బాగా పరిచయాలున్నాయి.. కేటీఆర్, హరీశ్ రావుకు తాము ఎంత చెబితే అంత అంటూ నమ్మబలికారు.

వీళ్ల హంగు, ఆర్భాటం, మాయమాటలు నమ్మిన చాలామంది లక్షల్లో సమర్పించుకున్నారు. అలా వచ్చిన డబ్బుతో ఈ ముఠా జల్సాలు చేసింది. ఏకంగా 50 కార్లు మెయింటైన్ చేశారంటే, జనాల నుంచి వీళ్లు ఏ స్థాయిలో డబ్బులు దోచుకున్నారో అర్థం చేసుకోవచ్చు.

ఇల్లు ఇప్పిస్తామంటూ రోజులు, వారాలు, నెలలు వాయిదా వేస్తుండడంతో డబ్బులు కట్టిన ఓ బాధితుడికి అనుమానం వచ్చింది. తనకుతానుగా ఆఫీసులు చుట్టూ తిరిగి ఎంక్వయిరీ చేయగా, తను మోసపోయాననే విషయాన్ని గ్రహించాడు. వెంటనే వెళ్లి పోలీసులకు ఫిర్యాదుచేశాడు. ముఠాను అరెస్ట్ చేసిన సైబరాబాద్ పోలీసులు, వాళ్ల నుంచి 50 కార్లను స్వాధీనం చేసుకున్నారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాలపై మరోసారి క్లారిటీ ఇచ్చారు పోలీసులు. గవర్నమెంట్ స్కీమ్స్ కు దళారులు ఉండరని, అర్హులైన వారు నేరుగా వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని, మధ్యవర్తుల్ని నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ముఠా ఎన్ని కోట్ల రూపాయలకు టోకరా వేసిందనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.