వాలంటైన్స్ వీక్ లో భాగంగా ఈరోజు కిస్ డే, అంటే ఇష్టమైన వాళ్లకు ముద్దు ఇచ్చి ప్రేమను తెలిపే రోజు అన్నమాట. ఈ సందర్భంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, నారా లోకేష్ కు ముద్దు ఇచ్చాడు. నేరుగా కాకపోయినా, ఫ్లయింగ్ కిస్ రూపంలో తన ప్రేమను వెల్లడించాడు.
వ్యూహం సినిమాను ఆపాలని నారా లోకేష్ ప్రయత్నించిన విషయం అందరికీ తెలిసిందే. ఆయన ఆ పని చేయడం వల్ల తమకు మరింత కలిసొచ్చిందంటున్నాడు ఆర్జీవీ. అందుకే ఈ ఫ్లయింగ్ కిస్.
“డిసెంబర్ లో సినిమా రిలీజ్ చేద్దాం అనుకున్నాం. కానీ లోకేష్ తన బుర్ర వాడి ఈ సినిమాను సరిగ్గా ఎన్నికల ముందు రిలీజ్ అయ్యేలా చేశాడు. లోకేష్ ఎంత తెలివైనోడంటే, డిసెంబర్ లోనే ఈ సినిమా రిలీజై ఉంటే ఈపాటికి జనం మరిచిపోయేవారు. కానీ లోకేష్ సరైన వ్యూహం పన్ని ఎలక్షన్ల టైమ్ లో వ్యూహం రిలీజ్ అయ్యేట్టు చేశాడు. అది లోకేష్ తెలివి. అందుకే లోకేష్ కు ముద్దు ఇచ్చాను.”
సెన్సార్ ఎఫెక్ట్ తన సినిమాపై పడదంటున్నాడు వర్మ. వాళ్లు కట్ చేసిన సన్నివేశాల్ని ఓటీటీలో లేదా యూట్యూబ్ లో రిలీజ్ చేస్తాననే అర్థం వచ్చేలా స్పందించాడు.
“చట్టం ప్రకారం సెన్సార్ సభ్యులు తమ పని తాము చేశారు. వాళ్లు చేసిన కట్స్ వల్ల సినిమాపై ఎలాంటి ప్రభావం పడలేదు. అయినా ఏది కట్ చేసినా ఎక్కడో ఒక చోట అది వస్తుంది. సెన్సార్ కట్స్ వల్ల సినిమాలో ఎమోషన్ తగ్గలేదు, లోకేష్ మీద ఒట్టు.”
రీసెంట్ గా థియేటర్లలోకి వచ్చిన యాత్ర-2లో షర్మిల పాత్ర లేదు. అయితే వ్యూహంలో మాత్రం షర్మిల పాత్ర ఉందని క్లారిటీ ఇచ్చాడు రామ్ గోపాల్ వర్మ.