రాజీనామా ప్రకటన సందర్భంగా తీవ్ర భావోద్వేగానికి లోనైన నటుడు బెనర్జీపై “మా” మాజీ అధ్యక్షుడు నరేష్ దారుణ కామెంట్ చేశాడు. బెనర్జీతో పాటు ఆ మీటింగ్‌లో ఏడ్చిన మగవాళ్లను ముండమోపులతో ఆయన పోల్చడం మరోసారి వివాదమైంది. నరేష్ పరుష కామెంట్స్ హాట్ టాపిక్‌గా నిలిచాయి.
“మా” నూతన అధ్యక్షుడిగా మంచు విష్ణు బాధ్యతలు స్వీకరించారు. అలాగే మంచు విష్ణు ప్యానల్‌లో గెలుపొందిన ఇతరులు కూడా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమాన్ని నరేష్ దగ్గరుండి పర్యవేక్షించారు. అనంతరం ప్రకాశ్‌రాజ్ రాజీనామాలపై స్పందించాలని నరేష్‌ను మీడియా కోరింది. నరేష్ స్పందిస్తూ… తనదైన స్టైల్‌లో ప్రకాశ్ ప్యానల్‌పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.
ఎమోషన్స్, మానసిక ఒత్తిళ్లతో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌ను డిస్ట్రబ్ చేయొద్దని కోరారు. ఎన్నికల తర్వాత కూడా వాళ్లు ఆరోపణలు చేస్తుండడం విచారకరమన్నారు. వాళ్ల రాజీనామాల విషయమై “మా” సభ్యులే చూసుకుంటారన్నారు. తాను మాట్లాడనని తెలిపారు. తమకు ఎవరు కావాలో మెంబర్స్ గెలిపించుకున్నారని తెలిపారు. అలాంటప్పుడు ఆరోపణలు ఎందుకు అని ప్రశ్నించారు.
ప్రకాశ్‌రాజ్ ప్యానల్ రాజీనామాల గురించి కొత్త కార్యవర్గం చూసుకుంటుందన్నారు. రాజీనామాలు ఎందుకు చేశారు? చేయాల్సిన అవసరం ఏంటి? కలిసి పని చేయాలి కదా అని ప్రశ్నించారు. ఓడినా, గెలిచినా కలిసి పనిచేస్తామన్నారని, మాట మీద ఉండాలి కదా అని నరేష్ ప్రశ్నించారు. మోడీ గెలిచారని కాంగ్రెస్ దేశం విడిచిపోతుందా అని ప్రశ్నించారు.
“మా” ఎన్నికల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలను ఆయన ఖండించారు. ముండమోసినట్టు ఎందుకు ఏడుస్తున్నారని నరేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొంత మంది మగవాళ్లు కూడా ఏడ్చడం చూశానన్నారు. వాళ్ల పేర్లు చెప్పదలచు కోలేదని పరోక్షంగా బెనర్జీ, ఉత్తేజ్‌లపై దారుణ కామెంట్స్ చేశారు.
మగవాళ్లు ఎందుకు ఏడుస్తారు? అతిగా ఏడ్చే మగవాళ్లను నమ్మొద్దంటారని దెప్పి పొడిచారు. ఇప్పటికీ పిలుస్తున్నాం… కలిసి పని చేద్దాం రండి అని నరేష్ అన్నారు. ఏమవుతుంది లోపలుంటే కొడతారా, తిడతారా? ఏం మాట్లాడుతున్నారు? ఇవన్నీ మానేయాలని ప్రకాశ్‌రాజ్ ప్యానల్‌కు హితవు పలికారు.