చంద్రబాబు అరెస్ట్.. సీనియర్ నటుడు నో కామెంట్

చంద్రబాబు అరెస్ట్ పై ఇప్పటికే టాలీవుడ్ తన వైఖరి ఏంటనేది చెప్పకనే చెప్పింది. సురేష్ బాబు లాంటి సీనియర్ ప్రొడ్యూసర్ అయితే, చంద్రబాబు గాలి తీసిపడేశారు. టాలీవుడ్ కు చంద్రబాబు కంటే చెన్నారెడ్డి, ఎన్టీఆర్…

చంద్రబాబు అరెస్ట్ పై ఇప్పటికే టాలీవుడ్ తన వైఖరి ఏంటనేది చెప్పకనే చెప్పింది. సురేష్ బాబు లాంటి సీనియర్ ప్రొడ్యూసర్ అయితే, చంద్రబాబు గాలి తీసిపడేశారు. టాలీవుడ్ కు చంద్రబాబు కంటే చెన్నారెడ్డి, ఎన్టీఆర్ ఎక్కువ మేలు చేశారని కుండబద్దలు కొట్టారు. ఇక మిగతా ప్రొడ్యూసర్లు, హీరోలు కూడా లైట్ తీసుకున్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి మరో సీనియర్ నటుడు చేరాడు.

ఈ రోజు మీడియా ముందుకొచ్చాడు సీనియర్ నటుడు నరేష్. చంద్రబాబు అరెస్ట్ ను ఖండించాలంటూ ఓ సెక్షన్ మీడియా ఈయన్ను కూడా అడిగింది. దానికి ఆయన సూటిగా సమాధానం ఇచ్చారు. “నేను ప్రత్యేకంగా ఏ ఒక్క నాయకుడి గురించి మాట్లాడను” అనేది ఆయన స్పష్టమైన సమాధానం.

అయితే ఏ అంశంపైనైనా చాలా తెలివిగా స్పందించే నేర్పరితనం నరేష్ సొంతం. చంద్రబాబు అరెస్ట్ పై కూడా అంతే నేర్పుగా సమాధానం ఇచ్చారు. స్పందించను అంటూనే, ధర్మం గెలుస్తుందన్నారు. అయితే ఆ ధర్మం ఎటువైపు ఉందో చెప్పలేదు. రాజకీయ నాయకులు సరిగ్గా పనిచేస్తే దానికి తప్పకుండా విలువ ఉంటుందన్నారు. 

ప్రస్తుతం డబ్బుకు, రాజకీయాలకు మధ్య చిక్కుముడులు పడ్డాయని, ఆ ముడుల్ని ఎవరైనా విప్పాలని కోరారు. ఒకప్పుడు క్రియాశీల రాజకీయాల్లో తను చురుగ్గా పాల్గొన్నానని, ప్రస్తుతం రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం అస్సలు లేదన్నారు. ఎందుకుంటే, ప్రస్తుతం రాజకీయ నాయకులు వ్యక్తిగతంగా తిట్టుకుంటున్నారని, అలాంటి తిట్లు తను తట్టుకోలేనన్నారు.

సినిమా అనేది రాజకీయాలకు బాణం లాంటిదని.. సినిమా ద్వారా ఎంతో చెప్పొచ్చని.. ఇక నుంచి తను ఏదైనా మంచి చెప్పాలనుకుంటే సినిమా ద్వారానే చెబుతానని అన్నారు నరేష్. ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీ ఆర్టిస్టుగా కొనసాగుతున్నారు నరేష్.