ఇన్ని రోజులూ ప్రతి ఈవెంట్ సందర్భంగానూ జంటగా కనిపించారు. ప్రతి పండగనూ జంటగా సెలబ్రేట్ చేసుకుని సోషల్ మీడియాలో ఫొటోలు పెట్టారు. అయితే ఉన్నఫలంగా ఆమె ఒక్కతే కనిపించే సరికి అంతా ఆశ్చర్యపోతూ ఉన్నారు. ప్రతి పండగకూ కొత్త పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు మాదిరి జంటగా కనిపించే వాళ్లు ఈ సారి అలా కాకుండా సింగిల్ గా సెలబ్రేట్ చేసుకునే సరికి.. బ్రేకప్ ఊహాగానాలు చెలరేగుతూ ఉన్నాయి. ఇది నయనతార, విఘ్నేష్ శివన్ విషయంలో!
గత కొన్నాళ్‌లుగా వీరిద్దరూ అనేక సందర్భాల్లో జంటగా కనిపించారు. ప్రేమలో ఉన్నట్టుగా అలా స్పష్టతను ఇచ్చారు. హిందూ, క్రిస్టియన్ పండగలన్నింటికీ వీరు జంటగా కనిపించారు. ఓనం, క్రిస్మస్ లను జంటగా జరుపుకుని ఫొటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అయితే న్యూ ఇయర్ సందర్భంగా మాత్రం నయనతార సింగిల్ ఫొటోలను పోస్టు చేసింది. ఒంటరిగా ఆ పండగను జరుపుకున్నట్టుగా పిక్స్ ను పెట్టింది!
ఇంకేముంది.. జంటగా కనపడాల్సిన ఆమె ఒంటరిగా కనిపించే సరికి బ్రేకప్ అయ్యిందనే ప్రచారం గట్టిగా సాగుతూ ఉంది. అందుకు సంబంధించి అనుబంధ కథలను కూడా వినిపిస్తూ ఉంది తమిళ మీడియా. పెళ్లి చేసుకోవాలంటూ నయనను విఘ్నేష్ ఒత్తిడి చేస్తూ ఉన్నాడని, దీంతో నయన అతడికి బ్రేకప్ చెప్పిందని తమిళ మీడియా వర్గాలు ప్రచారం చేస్తూ ఉన్నాయి.
పెళ్లి విషయంలో నయనతార తొందరపడాలని అనుకోవడం లేదని, కెరీర్ బ్రహ్మాండంగా సాగుతున్న నేపథ్యంలో ఆమె ఇప్పుడే కాదని అంటోందని, అయితే విఘ్నేష్ కు మాత్రం ఇంట్లోంచి ఒత్తిడి ఎదురవుతోందని, ఈ క్రమంలో వీరి బ్రేకప్ జరిగిందని ప్రచారం జరుగుతూ ఉంది. ఇటీవలే వీరిద్దరూ జంటగా గుళ్లూగోపురాలు తిరిగారు. అప్పుడు పెళ్లి ఊహాగానాలు వినిపించాయి, ఇప్పుడు బ్రేకప్ ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. మరి వీటిపై నయన ఏమని స్పందిస్తుందో!