పచ్చి అబద్ధాలు, దగాకోరు మాటలు.. మరీ అంత నిర్భీతిగా, తనకు అనుకూలంగా అబద్దాలను చెప్పుకు తిరుగుతున్నారు తెలుగుదేశం అధినేత. చంద్రబాబు నాయుడు చెప్పే పాత అబద్ధాల గురించి కాదిక్కడ. ఆయన రొటీన్ గా చెప్పుకు తిరిగే అబద్ధాల గురించి చాలా సార్లు మీడియా ప్రస్తావిస్తూనే ఉంటుంది. సోషల్ మీడియా ఈ విషయంలో దుమ్మెత్తిపోస్తూ ఉంటుంది. అయితే చంద్రబాబు నాయుడు ఇప్పుడు కొత్త కొత్త అబద్ధాలు, తనకు తోచిన అబద్ధాలు చెబుతూ ఉన్నారు.
అయితే యథారీతిన చంద్రబాబు నాయుడు ఈ విషయాల్లో సోషల్ మీడియాకు దొరికిపోతూ ఉన్నారు. ఆయన అనుకూల మీడియా ఆయన అబద్ధాలను కూడా అతికినట్టుగా కవర్ చేస్తోంది ఏమో కానీ, సోషల్ మీడియా మాత్రం చంద్రబాబు అబద్ధాలను ఏకేస్తోంది.
ఇంతకీ చంద్రన్న అబద్ధాల పథకంలో కొత్తవి ఏమిటంటే.. శివరామకృష్ణన్ కమిటీ రిపోర్ట్ గురించి. రాజధాని ప్రాంతానికి అమరావతి ప్రాంతం తగిన వేదిక అంటూ శివరామకృష్ణన్ కమిటీ చెప్పిందంటున్నారు చంద్రబాబు నాయుడు. ఇలా పచ్చి అబద్ధాన్ని ఒకటి తెర మీదకు తెచ్చారు.
రాజధాని ప్రాంతంగా అమరావతి ప్రాంతం ఏ మాత్రం తగినది కాదని శివరామకృష్ణన్ కమిటీ తేల్చి చెబితే, చంద్రబాబు నాయుడు మాత్రం దాన్ని పూర్తిగా వక్రీకరిస్తున్నారు. రాజధాని గా అమరావతి ప్రాంతాన్ని పెట్టాలంటూ ఆ కమిటీ చెప్పిందంటూ తన తాజా అబద్ధాన్ని తెర మీదకు తెచ్చారు. రాజధానిని వికేంద్రీకరించాలంటూ ఆ కమిటీ స్పష్టం చేసింది. అంతేకాదు.. ప్రభుత్వ భూమి అందుబాటులో ఉన్న చోట రాజధానిని పెట్టుకోవాలని చెప్పింది. భారీ రాజధాని ఆలోచనే కూడదని ఆ కమిటీ స్పష్టం చేసింది. ఆ కమిటీ నివేదికను పూర్తిగా తుంగలోకి తొక్కిన ఘనత చంద్రబాబుది.
శివరామకృష్ణన్ కమిటీని చిత్తు కాగితంగా పడేస్తున్నారంటూ చంద్రబాబు మీద అప్పుడు తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే వాటిని ఆయన ఖాతరు చేయలేదు. ఆ కమిటీ నివేదికకు పూర్తి విరుద్ధంగా అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించుకున్నారు. ఇప్పుడేమో.. అక్కడ రాజధాని ఉండాలంటే ఆ కమిటీ చెప్పిందంటున్నారు తెలుగుదేశం అధినేత. ఆయన అబద్ధాలకు ఒక హద్దంటూ ఉండదు.. అబద్ధాలను పదే పదే చెప్పి వాటిని నిజాలను నమ్మించాలని చూడటమే చంద్రబాబు నైజం అనే విషయం మరోసారి స్పష్టం అవుతోందని..పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.