నయనతార నటించిన అన్నపూరణి సినిమా రోజురోజుకు మరిన్ని వివాదాల్లో ఇరుక్కుపోతోంది. హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ ఈ చిత్రంపై ఇప్పటికే పోలీస్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నయనతారపై కూడా కేసు ఫైల్ అయింది.
ఇప్పుడీ వివాదం మరో మలుపు తీసుకుంది. తాము స్ట్రీమింగ్ చేసిన అన్నపూరణి సినిమాను స్ట్రీమింగ్ నుంచి తొలిగిస్తున్నట్టు నెట్ ఫ్లిక్స్ ప్రకటించింది. ఆ వెంటనే సదరు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నుంచి సినిమా మాయమైంది.
డిసెంబర్ 1న విడుదలైంది నయనతార అన్నపూరణి సినిమా. థియేటర్లలో ఈ సినిమా ఫ్లాప్ అయింది. దీంతో అదే నెల చివర్లో సినిమాను స్ట్రీమింగ్ కు పెట్టారు. ఓటీటీలోకి వచ్చిన తర్వాత దీనిపై అభ్యంతరాలు మొదలయ్యాయి.
బిర్యానీ చేసే ముందు హీరోయిన్ నయనతార నమాజ్ చేయడాన్ని చాలామంది తప్పుపట్టారు. ఓ హిందూ పూజారి కూతురు, బిర్యానీ చేసేముందు ఇలా నమాజ్ చేయడాన్ని కొన్ని హిందూవర్గాలు నిరశిస్తున్నాయి. దీంతో పాటు లవ్ జీహాద్ ను ప్రోత్సహించేలా సినిమాలో కొన్ని సన్నివేశాలున్నాయని చెబుతున్నారు కొంతమంది.
ఇలాంటి కొన్ని వివాదాస్పద అంశాల్ని బేస్ చేసుకొని గతవారం ఈ సినిమా నిర్మాతలు, హీరోయిన్ పై కేసు నమోదైంది. ఈ కేసుపై తాజాగా నిర్మాణ సంస్థ జీ గ్రూప్ స్పందించింది. బ్రాహ్మణ సమాజం మనోభావాలు దెబ్బతీయడం తమ ఉద్దేశం కాదని, అందరూ తమను క్షమించాలంటూ తాజాగా జీ గ్రూప్ లెటర్ విడుదల చేసింది.
ఆ వెంటనే నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ సినిమాను స్ట్రీమింగ్ నుంచి తొలిగించింది. దీనికి సంబంధించి ముగ్గురు ఉద్యోగులపై కూడా వేటు వేసే ఆలోచనలో ఉంది ఆ కంపెనీ. మొత్తమ్మీద నయనతార నటించిన ఈ సినిమా హిట్ కాకపోగా, వివాదాలకు కేంద్రబిందువుగా మారింది.