ఎలాంటి అవకాశాన్ని అయినా ముందుగా అందిపుచ్చుకుంటుంది టాలీవుడ్. కానీ ఎలాంటి గొప్ప సంస్థ అయినా టాలీవుడ్ జనాల తెలివి తేటల ముందు కుదేలు కావాల్సిందే. ఆఖరికి టాలీవుడ్ కు ఓ దండం అంటూ పక్కకు తప్పుకొవాల్సిందే. అవి ఫైనాన్స్ సంస్థలు అయినా, మరే వ్యవహారాలు అయినా.
లేటెస్ట్ గా ఆన్ లైన్ స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫారమ్ నెట్ ఫ్లిక్స్ కు నిర్మాతలు ఆర్కే మీడియాకు మధ్య చిన్న తకరార నెలకొన్నట్లు తెలుస్తోంది. ఓ వెబ్ సిరీస్ విషయంలో ఈ రెండు సంస్థలకు మధ్య పంచాయతీ నడుస్తున్నట్లు బోగట్టా.
విషయం ఏమిటంటే, బాహుబలి పెద్ద హిట్ అయిన తరువాత నెట్ ఫ్లిక్స్ నుంచి బాహుబలి మేకర్స్ కు ఓ మాంచి ఆఫర్ వచ్చింది. నెట్ ఫ్లిక్స్ కోసం 18 బాహుబలి ఎపిసోడ్ లు చేయాలని, దానికి దాదాపు 100 కోట్ల వరకు ఆఫర్ అని తెలుస్తోంది. ఆర్కే మీడియా దీన్ని అందిపుచ్చుకుని, దేవాకట్టా, రాజమౌళి లాంటి కొంతమందితో ఎపిసోడ్ లు ప్రిపేర్ చేయించినట్లు బోగట్టా.
ఇటీవల నెట్ ఫ్లిక్స్ ప్రతినిధులు ఈ ఎపిసోడ్ లను చూసి పెదవి విరిచినట్లు, మార్పులు చేర్పులు సూచించడంతో వచ్చింది తంటా. ముందుగా అన్నీ చూసుకునే ఓకె అన్నారని ఆర్కే మీడియా వాదించడంతో, ఈ వ్యవహారంలో ఇన్ వాల్వ్ అయిన కొంతమంది నెట్ ఫ్లిక్స్ సిబ్బందికి ఉద్వాసన పలికేసారని బోగట్టా.
ఇప్పుడు కావాలంటే మరి కాస్త మొత్తం ఇస్తాం..సరైన ఎపిసోడ్ లు ఇవ్వాలని నెట్ ఫ్లిక్స్, ఇంతకన్నా వీలుకాదని వీళ్లు పంచాయతీలు జరుపుతున్నట్లు బోగట్టా. నెట్ ఫ్లిక్స్ కావచ్చు, అమెజాన్ కావచ్చు, మన డైరక్టర్లను నమ్మి అప్ప చెప్పిన వెబ్ సిరీస్ లు ఏవీ అప్ టు ది మార్క్ రాకపోవడం, ఆదరణకు నోచుకోకపోవడం చిత్రం. ఇప్పుడు బాహబలి వెబ్ సిరీస్ వ్యవహారం కూడా అలాగే వుంది.