నెటిజన్లు తమ అభిప్రాయాలను నిర్మొహమాటంగా వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఈ ధోరణి కాస్త శ్రుతి మించుతోంది. కామెంట్స్ స్థాయి నుంచి ట్రోలింగ్‌కు దారి తీస్తున్నాయి. తాజాగా బాలీవుడ్ బుల్లితెర నటి చారు అసోపాపై కొందరు నెటిజన్లు దారుణమైన ట్రోలింగ్‌కు పాల్పడుతున్నారు. అదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మహాదేవ్, దియా ఔర్ బాతి హమ్, మేరే ఆంగ్నే మెయిన్, మహారక్షక్ వంటి టీవీ షోలలో చారు అసోపా నటించి ప్రేక్షకుల్ని మెప్పించి మంచి పేరు సంపాదించారు. వెండితెరపై కూడా ఆమె కనిపించారు. కాల్ ఫర్ ఫన్, ఇంపేషెంట్ వివేక్ వంటి సినిమా ల్లోనూ చారు నటించారు. గత ఏడాది జూనల్‌లో మాజీ మిస్ యూనివర్స్ సుస్మితాసేన్ సోదరుడు రాజీవ్ సేన్‌ను చారు పెళ్లి చేసుకున్నారు.
లాక్‌డౌన్ నేపథ్యంలో చారు ఇంట్లోనే ఉంటున్నారు. దీంతో తనకు నచ్చిన డ్రెస్సులు వేసుకుని బయటికి వెళ్లలేకపోతున్నట్టు ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా తాను ఎంతో ఇష్టపడే రెడ్ కలర్ క్రాప్ జాకెట్ ధరించి ఇంట్లో ఫొటో దిగి ఇన్‌స్టా గ్రామ్‌లో షేర్ చేశారు. పనిలో పనిగా ఇదే డ్రెస్‌లో ఓ పాటకు స్టెప్పులేస్తూ ఆ వీడియోని కూడా అభిమానులతో పంచుకున్నారు.
చారు పోస్టుపై నెటిజన్లు రకరకాల అభిప్రాయాలతో స్పందించడం స్టార్ట్ చేశారు. రెడ్ దుస్తుల్లో అదిరిపోయారంటూ అభిమానులు ప్రశంసలు కురిపిస్తుంటే, మరి కొందరు మాత్రం వేషధారణ సరిగా లేదని, ఇలాంటి దుస్తులేసుకోడానికి సిగ్గు లేదా అని మండిపడ్డారు. ఈ పరంపరలో శోభ అనే నెటిజన్ ఘాటుగా రియాక్ట్ కావడం హాట్ టాపిక్ అయింది.
‘ఆ మాత్రం బట్టలు కూడా ఎందుకు’ అంటూ చారుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ కామెంట్లపై చారు ఘాటుగా సమాధానం ఇచ్చారు. ‘నా శరీరం బాగుంది కాబట్టి నేను చూపించాలనుకుంటాను. ఒకవేళ మీకు కూడా ఉంటే మీరు కూడా చూపించవచ్చు’. అంటూ విమర్శలను తిప్పికొట్టే యత్నం చేశారు. అంతేకాదు చూసే కళ్లను బట్టే ఎదుటివారిపై అభిప్రాయం మారుతుందని ఆమె సమాధానం ఇచ్చారు. కానీ నెగిటివ్ ట్రోలింగ్ వైరల్ కావడం విశేషం.