వీరాభిమాని రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ కేసును రోజుల వ్యవథిలో పోలీసులు ఛేదించి దర్శన్ ను అరెస్ట్ చేశారు. అతడి ప్రియురాలు పవిత్రతో కలిపి మొత్తంగా 16 మందిని ఈ కేసులో అరెస్ట్ చేశారు.
రోజురోజుకు ఈ కేసుకు సంబంధించి కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రేణుకాస్వామిని బెంగళూరులోని ఓ షెడ్డుకు తీసుకెళ్లి హత్య చేసిన క్రమంలో, ఘటన మొత్తాన్ని ఓ వ్యక్తి తన మొబైల్ లో రికార్డ్ చేశాడని, అతడి కోసం పోలీసులు గాలిస్తున్నట్టు కథనాలు వచ్చాయి.
ఇప్పుడు వీటికి కొనసాగింపుగా మరో కథనం వినిపిస్తోంది. ఈ హత్య కేసుకు సంబంధించి కొన్ని అంశాల్ని హీరో దర్శన్ అంగీకరించాడట. రేణుకాస్వామిని తీసుకురమ్మని చెప్పింది తానేనని దర్శన్ అంగీకరించాడట. పవిత్రకు అసభ్య సందేశాలు, వీడియోలు పంపించడంతో, పిలిచి వార్నింగ్ ఇద్దామని తీసుకురమ్మని చెప్పానని దర్శన్ పోలీసుల ముందు ఒప్పుకున్నాడట.
రేణుకా స్వామితో పవిత్రకు సారీ చెప్పించాలనే ఉద్దేశంతో షెడ్డుకు వెళ్లిన దర్శన్.. రేణుకాస్వామిపై జస్ట్ 2 దెబ్బలు మాత్రమే వేశాడట. అక్కడితో కోపం తగ్గిపోయిందట. ఆ వెంటనే జేబులోంచి డబ్బులు తీసి అతడికిచ్చి ఏదైనా తిని ఇంటికెళ్లమని చెప్పాడట. ఆ వెంటనే అక్కడ్నుంచి దర్శన్ వెళ్లిపోయాడట.
ఆ తర్వాత మిగతా వ్యక్తులంతా కలిసి తనను హత్య చేసి, దాన్ని తన మెడకు చుట్టారని పోలీసుల ముందు దర్శన్ చెప్పినట్టు కథనాలు వస్తున్నాయి.
కస్టడీ పొడిగింపు
ఈ కేసుకు సంబంధించి సోమవారం వరకు కస్టడీ ఉంది. అయినప్పటికీ లాంగ్ వీకెండ్ ను దృష్టిలో పెట్టుకొని నిన్ననే కోర్టు ముందు అందర్నీ హాజరుపరిచారు. జడ్జి నిందితుల పోలీస్ కస్టడీని 20వ తేదీ వరకు పొడిగించింది.
ఈ 4 రోజుల్లో కేసును పూర్తిస్థాయిలో కొలిక్కి తీసుకురావాని పోలీసులు గట్టిగా ట్రై చేస్తున్నారు. ఈ మేరకు టెక్నికల్ సాక్ష్యాల్ని సంపాదించిన పోలీసులు, నిందితుల్లో చాలామంది నుంచి వాంగ్మూలం సేకరించారు. దర్శన్ కూడా షెడ్డుకు వెళ్లినట్టు ఒప్పుకున్నట్టయింది. తనే తీసుకురమ్మని చెప్పినట్టు కూడా అతడు అంగీకరించినట్టు తెలుస్తోంది. అటు దర్శన్ లాయర్ కూడా ఇదే విషయం చెబుతున్నాడు.
మరోవైపు అరెస్ట్ అయిన నిందితుల్లో ఒకడి తండ్రి గుండెపోటుతో మరణించాడు. కొడుకు హత్య కేసులో ఇరుక్కుపోవడంతో అతడు గుండె ఆగి చనిపోయాడు. నిందితుడ్ని పోలీసు రక్షణలో అంత్యక్రియలకు తీసుకెళ్లి, తిరిగి జైలుకు తీసుకొచ్చారు.
పోలీసులు.. ఆ ముగ్గురూ ముగ్గురే
ఈ హై-ప్రొఫైల్ కేసును రికార్డ్ టైమ్ లో ఛేదించిన ఘనత ముగ్గురు పోలీసులకు దక్కుతుంది. పోలీస్ కమిషనర్ బి.దయానంద, వెస్ట్ జోన్ డిప్యూటీ కమిషనర్ గిరీష్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ చందన్ కుమార్ ఈ కేసును పక్కాగా కొలిక్కి తీసుకొచ్చారు. వీళ్లు ముగ్గురి సమన్వయంతోనే ఈ కేసు త్వరతగతిన కొలిక్కి వచ్చింది.
హత్య జరిగిన వెంటనే అరెస్ట్ అయిన నలుగురు నిందితులు చెప్పిన విషయాల్లో పొంతన కుదరలేదు. పైగా బెంగళూరుకు చెందిన ఈ నలుగురు, 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామిని బెంగళూరుకు తీసుకొచ్చి మరీ చంపేంత కక్ష ఏముందనే డౌట్ ముందుగా గిరీష్ కు వచ్చింది. అక్కడ్నుంచే కేసు కొత్త మలుపు తిరిగింది.
అప్పుడే దర్శన్ పేరు వెలుగులోకి వచ్చింది. ఓ స్టార్ హీరో పేరు తెరపైకి రావడంతో వెంటనే ఈ కేసులోకి ఏసీపీ చందన్ కుమార్ ను కూడా తీసుకొచ్చారు. దర్శన్ ను అరెస్ట్ చేసింది ఈయనే. ఓవైపు కొంతమంది పెద్ద మనుషుల నుంచి ఫోన్లు వస్తున్నప్పటికీ, దర్శన్ ను పోలీసు జీపు ఎక్కించిన ఘనత ఈయనకే దక్కుతుంది.
ఇక వీళ్లందరి బాస్ దయానంద్ చొరవ కూడా ఈ కేసు పురోగతికి కారణమైంది. ఒక దశలో సాక్ష్యాల సేకరణ, నిర్థారణకు స్వయంగా దయానంద్ వెళ్లడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. అలా సాక్ష్యాలు తారుమారు కాకుండా, పక్కా సాక్ష్యాలు రాబట్టడంలో దయానంద్ కీలక పాత్ర పోషించారు. వీళ్ల ముగ్గురే ఈ కేసును దాదాపు కొలిక్కి తీసుకొచ్చారు.