పెళ్లి, పిల్లలు తర్వాత రీఎంట్రీ ఇచ్చిన కాజల్ కు అవకాశాలైతే బాగానే వస్తున్నాయి కానీ సరైన సక్సెస్ మాత్రం రావడం లేదు. భగవంత్ కేసరి హిట్ అయినప్పటికీ, బాలకృష్ణ-శ్రీలీల మేజర్ క్రెడిట్ కొట్టేశారు. అది న్యాయం కూడా. అలా మెయిన్ స్ట్రీమ్ గ్లామర్ హీరోయిన్ రోల్స్ కు దాదాపు దూరమైన ఈ బ్యూటీ.. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేయాలని ఫిక్స్ అయింది.
ఇందులో భాగంగా ఎన్నో ఆశలు పెట్టుకొని చేసిన సత్యభామ సినిమా ఆమెకు షాకిచ్చింది. నిజానికి సత్యభామ సినిమాను ఆమె కేవలం ఓ మూవీగా చూడలేదు. తన కెరీర్ కు టర్నింగ్ పాయింట్ గా చూసింది. తొలిసారి యాక్షన్ ఎలిమెంట్స్ తో కూడిన కథలో లీడ్ రోల్ చేసిన కాజల్, ఈ సినిమా కోసం చాలా కష్టపడింది. ఆ తర్వాత ప్రచారం చేస్తూ ఇంకా కష్టపడింది. కానీ అనుకున్న ఫలితాన్ని మాత్రం అందుకోలేకపోయింది.
దీంతో కాజల్ కెరీర్ పై ఇప్పుడు కొత్త ప్రశ్నలు తలెత్తాయి. లీడ్ రోల్స్ చేస్తానంటే ఆమెకు అవకాశాలొస్తాయా? మరో 2-3 ఛాన్సులొచ్చినా నిరూపించుకోకపోతే కాజల్ పరిస్థితేంటి? గ్లామర్ రోల్స్ కు దూరమైన కాజల్, ఇకపై ఎలాంటి పాత్రలు చేయాలి?
త్వరలోనే ఆమె నుంచి మరో 2 సినిమాలు రాబోతున్నాయి. అందులో భారతీయుడు-2 ఒకటి. ఈ సినిమాలో కాజల్ దాదాపు కనిపించదు. కాబట్టి ఈ మూవీతో ఆమె కెరీర్ ను ముడిపెట్టలేం. ఇక రెండోది కన్నప్ప. ఈ సినిమాలో కూడా కాజల్ రోల్ అంతంతమాత్రమే. యూనిట్ పైకి చెప్పకపోయినా ఆమెది అతిథి పాత్రే.
సో.. కాజల్ కెరీర్ మరికొన్నాళ్లు కొనసాగాలంటే అర్జెంట్ గా ఆమెకు ఓ హిట్ కావాలి. అంతకంటే ముందు ఎలాంటి పాత్రలు చేయాలనే అంశంపై కాజల్ ఓ క్లారిటీకి రావాలి.