‘పవర్ స్టార్’ విడుదలకు మరికొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది. జూలై 25న ఉదయం 11 గంటలకు ఆర్టీవీవరల్డ్ థియేటర్. కామ్‌లో ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే ట్రైలర్ ఓ మోస్తరు సంచలనం, వివాదం క్రియేట్ చేసింది. ఆర్జీవీ కార్యాలయంపై జనసైనికుల దాడితో వివాదం మరింత రాజుకున్నట్టైంది.
ఈ సినిమా విడుదల సమయం దగ్గర పడేకొద్ది దర్శకుడు రాంగోపాల్‌వర్మ అంతకంతకూ హీట్ పెంచుతున్నాడు. తాజాగా వర్మ మార్క్ సినిమా ప్రమోషన్ స్టార్ట్ అయింది. ఈ సందర్భంగా సినిమా సన్నివేశాలకు సంబంధించి మరో మూడు వీడియోలను వర్మ ట్విటర్‌లో విడుదల చేశాడు. బండ్ల గణేష్ క్యారెక్టర్‌కు సంబంధించిన వీడియో 15 సెకండ్లు, చిరు, బాబు పాత్రలకు సంబంధించి ఒక్కొక్కటి 14 సెకండ్ల నిడివితో వీడియోలున్నాయి.
బండ్ల గణేష్ కామెడీ పక్కన పెడితే, మరో రెండు వీడియోల్లో సీరియస్ సంభాషణలున్నాయి. ఒక వీడియోలో తమ్ముడిని చిరంజీవి ప్రశ్నిస్తుంటాడు. కానీ పవన్‌కల్యాణ్ ఒక్క మాట కూడా మాట్లాడడు. చిరంజీవి ఏమని ప్రశ్నిస్తారంటే…
‘నువ్వు పార్టీ పెడితే నిన్ను తిట్టమనురా. కానీ మీ అన్న సీట్లు అమ్ముకున్నాడు. మీ అన్న పార్టీని విలీనం చేశాడు. అది చేశాడు, ఇది చేశాడని ప్రతి ఒక్కరూ నన్ను తిడుతారేంటిరా?’ అని చిరంజీవి ఆవేశంగా నిలదీస్తున్న సన్నివేశం ఆసక్తి కలిగిస్తోంది.
ఇక మరో వీడియోలో పవన్, చంద్రబాబు ఎదురెదురుగా కూచొని ఉంటారు. ముందుగా నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ చంద్రబాబు మాట్లాడ్డం స్టార్ట్ చేస్తాడు.
‘జయాపజయాలకు ఎవరూ అతీతులు కాదు. అందులో మేము తప్పు చేశామనడం అసలు కరెక్ట్ కాదు’ అని బాబు తనదైన స్టైల్‌లో సీరియస్‌గా అంటాడు. బాబు మాటలపై అంతే సీరియస్‌గా పవన్ స్పందిస్తాడు.
‘మీరు ఈ దొంగతనాలు మానితే మంచిది’ అని పవన్ ఘాటుగా రియాక్ట్ అవుతాడు. పవన్ మాటలతో బాబుకు చిర్రెత్తుకొస్తుంది. బాబు ఆవేశంగా స్పందిస్తూ…‘ఏం మాట్లాడుతున్నారు మీరు’ అంటారు.
ఆ చిత్రంలోని కొన్ని సన్నివేశాలకు సంబంధించిన వీడియోలను ట్విటర్‌లో పోస్ట్ చేయడంతో … రెచ్చగొడుతున్నట్టు క్యాప్షన్స్ కూడా ఇచ్చాడు. వాళ్లు బ్రదర్సేనా? అని చిరు, పవన్ కల్యాణ్ వీడియోకు, అలాగే చంద్రబాబు-పవన్ వీడియోకు ఎవరు మాట్లాడుతున్నారో ఊహించండంటూ క్యాప్షన్ పెట్టడం కొందరికి ఆనందం, మరికొందరిలో ఆగ్రహం తెప్పిస్తున్నాయి. మొత్తానికి సినిమా ప్రమోషన్‌లో వర్మ కొత్త పుంతలు తొక్కుతున్నాడని చెప్పొచ్చు. చివరిగా ఒక్కమాట…మూడు వీడియోలు విడుదల చేయడం వెనుక సెంటిమెంట్ ఏదైనా ఉందా?