బీజేపీ అధిష్టానానికి ఎట్టకేలకు ఇప్పటికైనా జ్ఞానోదయం అయింది. టీడీపీ, ఎల్లో మీడియా ఊబి నుంచి బయటపడేందుకు మొదటి అడుగు పడింది. ఏపీలో బీజేపీ బలోపేతంపై దృష్టిం పెట్టింది. కొన్ని దశాబ్దాలుగా ఏపీలో బీజేపీ బలపడకపోవడానికి కారణాలను ఇప్పటికి తెలుసుకున్నట్టు…ఆ పార్టీ చర్యలను బట్టి అర్థమవుతోంది.
రాజధాని వికేంద్రీకరణ బిల్లు, మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ వ్యవహారంపై నిర్వహించే టీవీ డిబేట్లకు, ఇతరత్రా చర్చలకు ఎట్టి పరిస్థితుల్లో పోవద్దని తమ పార్టీ నేతలను బీజేపీ అధిష్టానం ఆదేశించింది. ఈ రెండు అంశాలకు సంబంధించి గవర్నర్, హైకోర్టులలో పెండింగ్ ఉన్న కారణంగా వెళ్లొద్దని ఆదేశించారని పైకి చెబుతున్నప్పటికీ…బలమైన కారణాలున్నాయని బీజేపీ నేతలు చెబుతున్నారు.
ఈ రెండు అంశాలపై ప్రధానంగా టీడీపీ అనుకూల చానళ్లు మాత్రమే చర్చ పెడుతున్నాయి. దీంతో బీజేపీ నేతలు తమ పార్టీ విధానాలను కాకుండా చానళ్ల పాలసీలకు అనుగుణంగా మాట్లాడుతుండడంపై బీజేపీ అధిష్టానానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్లినట్టు సమాచారం. దీంతో అభివృద్ధి వికేంద్రీకరణకు బీజేపీ వ్యతిరేకమనే అభిప్రాయం జనంలోకి వెళుతూ పార్టీకి డ్యామేజీ అవుతోందనే ప్రమాదాన్ని బీజేపీ నాయకత్వం గుర్తించి అప్రమత్తమైంది.
ఇంత కాలం ఏపీలో బీజేపీని బలపరచడానికి బదులు, ఆర్థికంగా, వ్యక్తిగతంగా తాము బలపడుతూ, రాజకీయంగా మాత్రం టీడీపీ ప్రయోజనాల కోసం ఒక సామాజికవర్గానికి చెందిన నేతలు వ్యవహరించడాన్ని బీజేపీ అధిష్టానం సీరియస్‌గా తీసుకున్నట్టు సమాచారం. ఇక మీదట అలాంటి నేతల తోకలు కత్తిరించడానికే కఠిన నిర్ణయం తీసుకున్నట్టు కొందరు ఏపీ బీజేపీ నేతలు చెబుతున్నారు.
కాంగ్రెస్, టీడీపీ నుంచి వచ్చిన కొందరు నేతలు బీజేపీలో ఉంటూ….చంద్రబాబు ప్రయోజనాల కోసం పనిచేస్తుండడాన్ని ఆధారాలతో సహా బీజేపీ నాయకత్వానికి…మొదటి నుంచి పార్టీలో ఉంటున్న నేతలు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. టీడీపీ ఎజెండాను కొన్ని చానళ్లు పనిగట్టుకుని మోస్తున్నాయని, వాటికి అనుగుణంగా మాట్లాడుతూ పార్టీని బద్నాం చేస్తున్నారనే ఆవేదనతో బీజేపీ అధిష్టానం కూడా ఏకీభవించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో అలాంటి నాయకుల ఆట కట్టించేందుకు అసలు ఆ అంశాలపై చర్చల్లోనే పాల్గొన వద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకొంది.