మెగా ఫ్యామిలీ ఏకైక హీరోయిన్ నిహారిక తన కాబోయే భర్త చైతన్యపై ప్రేమ కవిత్వం రాశారు. తన కాబోయే వాడి గురించి మెగా ప్రిన్స్ నిహారిక ఎంతో వినూత్నంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. గుంటూరు ఐజీ జొన్నలగడ్డ ప్రభాకర్‌రావు కుమారుడు చైతన్యతో కలిసి నిహారిక ఏడడుగులు నడవనున్నారు. ఇది పెద్దలు కుదిర్చిన వివాహం.
అంతకు ముందు ఓ ఇంటర్వ్యూలో ఈ ఏడాది లేదా వచ్చే ఏడాది మొదటికల్లా నిహారిక పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నట్టు మెగా బ్రదర్ నాగబాబు చెప్పారు. ఆయన చెప్పినట్టే పెళ్లి ఫిక్స్ అయింది.
చైతన్య బర్త్‌డే సందర్భంగా నిహారిక తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కాబోయే భర్తతో దిగిన ఫొటోలను షేర్ చేశారు. ఈ సందర్భంగా ఆమె బర్త్ డే విషెస్ చెప్పారు. అంతేకాదు చైతన్యపై తన మనసులో ఉప్పొంగుతున్న ప్రేమను అక్షరీకరించారు. మనువుతో ఒక్కటి కానున్న చైతన్యపై ఆమెలోని మధుర భావన నిహారికను ప్రేమ కవిత్వం రాసేలా ప్రేరేపించింది. హృదయంతో రాసిన ఆ కవిత్వాన్ని ఆస్వాదిద్దాం.
‘నీ నవ్వు గది మొత్తం వెలుగు నింపుతుంది. ఇంట్లో ఉన్న అనుభూతి కలిగిస్తుంది. నీ నవ్వు నా సంతోషపు చిరునామా. అన్నింటి కన్నా నువ్వు ఉత్తమమైనవాడివి. హ్యాపీ బర్త్‌డే చై’ అని నిహారిక శుభాకాంక్షలు చెప్పారు.
దీనికి చైతన్య స్పందిస్తూ.. ‘థ్యాంక్స్ నిహా.. జస్ట్ మేడ్ మై డే అగేన్’ అని కామెంట్ చేశారు. మొత్తానికి చూడ ముచ్చటైన జంట…మురిపాల మాటలు, రాతలతో పరస్పరం ప్రేమను పదిలం చేసుకుంటున్నారు.