వివాదాలకు ఆమె కేరాఫ్ అడ్రస్. నిత్యం వార్తల్లో ఉండడం ఆమె నైజం. ఆమే ప్రముఖ మోడల్, బాలీవుడ్ నటి పూనమ్ పాండే. ఆమె పెళ్లికి సిద్ధమయ్యారు. తన బాయ్ ఫ్రెండ్ సామ్ బాంబెతో పూనమ్ నిశ్చితార్థం జరిగింది. పూనమ్, సామ్ కొంత కాలంగా డేటింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే.
పూనమ్ అంటే ఎవరో తెలియని రోజుల్లో…తన చేష్టలతో అందరి దృష్టిని తన వైపు తిప్పుకునేలా చేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)5 లో కోల్‌కతా నైట్‌రైడర్స్ విన్నర్‌గా నిలిచిన తర్వాత ఇంటర్నేషనల్ బిజినెస్ టైమ్స్ పత్రికలో అభ్యంతరకర ఫొటోలతో పోజులిచ్చి వివాదానికి తెర తీశారు. బాలీవుడ్ ఎంట్రీకి ఆ పత్రికలో ప్రచురణ అయిన ఆ ఫొటోలే కారణమని చెప్పేవాళ్లున్నారు.
పూనమ్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే వివాదాలే ఎక్కువ. ఇక ప్రస్తుతానికి వస్తే పూనమ్‌తో తన నిశ్చితార్థం జరిగిన విష యాన్ని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆమె కాబోయే భర్త సామ్ వెల్లడించడం విశేషం. రింగ్‌లు మార్చుకున్న ఫొటోను ఆయన షేర్ చేశారు. ఈ సందర్భంగా ఫొటోతో పాటు ‘చివరకు మేము.. పూర్తి చేసాం’ అని క్యాప్షన్ కూడా ఇచ్చాడు. దీనిపై పూనమ్ స్పందిస్తూ బెస్ట్ ఫీలింగ్ అని చెప్పుకొచ్చారు. పెళ్లయిన తర్వాతైనా వివాదాలకు, సంచలనాలకు ఫుల్‌స్టాప్ పెడతారో లేదో మరి!