కార్తికేయ-2 తర్వాత నిఖిల్ భారీగా ఆశలు పెట్టుకున్న సినిమా స్వయంభూ. ఒక దశలో స్పై సినిమాను కూడా పక్కనపెట్టి స్వయంభూ ప్రీ-ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేశాడు నిఖిల్. ఇప్పుడీ సినిమా సెట్స్ పైకి వచ్చింది.
శ్రావణ శుక్రవారం సందర్భంగా స్వయంభూ సినిమా పూజా కార్యక్రమాలతో మొదలైంది. ఈరోజు నుంచే రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుపెట్టారు. ఠాగూర్ మధు సమర్పణలో భువన్-శ్రీకర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సంయుక్త మీనన్ ను హీరోయిన్ గా తీసుకున్నారు.
ఓపెనింగ్ సందర్భంగా స్వయంభూ నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. గుర్రంపై స్వారీ చేస్తూ, డ్రాగన్ పై బాణం వేస్తున్న పోరాట యోధుడిగా నిఖిల్ ను ప్రజెంట్ చేశారు. నిఖిల్ గెటప్ చూస్తే, ఇదొక హిస్టారికల్ ఫిక్షనల్ మూవీ అనిపిస్తోంది.
నిఖిల్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రంగా రాబోతున్న ఈ సినిమా కోసం కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ ను మ్యూజిక్ డైరక్టర్ గా తీసుకున్నారు. స్టార్ సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస, స్వయంభూ సినిమాకు వర్క్ చేస్తున్నాడు.
భరత్ కృష్ణమాచారి డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాను హిందీతో పాటు సౌత్ లోని అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు.