సినిమా ఏదైనా కావచ్చు. కానీ నైజాంలో తొలిరోజు అంకెలు, పూర్తి స్థాయి కలెక్షన్లు అంతా మాయ..మిధ్య. ఇది పచ్చి వాస్తవం.
ముఖ్యంగా ఏస్ డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు పంపిణీ చేసే పెద్ద సినిమాల తొలి రోజు, మలిరోజు, మరే రోజు అయినా బయటకు వచ్చే నెంబర్లు వేరు. అసలు నెంబర్లు వేరు. ఇవన్నీ ఇండస్ట్రీలో జనాలు చాలా మందికి తెలిసిన సంగతే. కానీ బయటకు వచ్చిన నెంబర్లే చలామణీ అవుతాయి.
ఏ పెద్ద హీరో సినిమా అయినా ఇదే తంతు. అసలు నెంబర్లు బయటకు రానివ్వరు. జీఎస్టీ కలిపి, ఆ పై మరికొంత కలిపి బయటకు రప్పిస్తారు. ఈ విషయంలో ఏ హీరోకి మినహాయింపు లేదు. ఫలానా సినిమా అని టార్గెట్ చేయనక్కర లేదు. అందరికీ ఈ విషయంలో సమ న్యాయమే.
అసలు అంకెలు నిర్మాతకు దిల్ రాజుకు మధ్యనే వుంటాయి. ఈ కలుపుడు, జీఎస్టీ తీసేసినా తరువాత కూడా తొలి రోజు నెంబర్లు అది ఏ సినిమా అయినా సరే కనీసం కోటి నుంచి రెండు కోట్లు తేడా వుంటుందన్నది ఇండస్ట్రీలో చాలా మందికి తెలిసిన సంగతే.
హీరోలతో మొహమాటం, వారి ప్రెస్టీజ్ కోసం ఈ విధంగా చేయక తప్పదు. అది ఈ సినిమా, ఆ సినిమా అని కాదు. అన్ని సినిమాల అంకెలు అంతా మాయ…మిధ్య.