ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై టీడీపీ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతోంది. జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యను ఆయుధంగా చేసుకుని తమ ప్రధాన ప్రత్యర్థిని ఇరుకున పెట్టేందుకు టీడీపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. మరోవైపు వివేకా కేసులో ఎటూ తేల్చుకోలేక జగన్ సతమతమవుతున్నట్టే కనిపిస్తోంది. కానీ రానున్న ఎన్నికల్లో మాత్రం జగన్‌పై పెద్ద ఎత్తున వివేకా హత్య కేసు, సీబీఐకి నిందితులు, బాధితులు ఇచ్చిన వాంగ్మూలాలను ప్రయోగించేందుకు టీడీపీ సమాయత్తమవుతోంది.
జనం అవినీతిని సహిస్తారు. కానీ నేర స్వభావం, అందులోనూ ఎంతో మంచి మనిషిగా పేరున్న వైఎస్ వివేకాను సొంత వాళ్లే హత్య చేశారనే ఆరోపణల విషయంలో మాత్రం క్షమించే పరిస్థితి ఉత్పన్నం కాదు. మాజీ మంత్రి వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్‌రెడ్డిని ముఖ్యమంత్రి జగన్ వెనకేసుకొస్తున్నారనే ఆరోపణలను టీడీపీ వ్యూహాత్మకంగా పదేపదే చెబుతోంది. ఈ పరంపర 2024 సార్వత్రిక ఎన్నికలు ముగిసే వరకూ కొనసాగుతోంది.
సీబీఐకి పలువురు సాక్షులు, నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలను ఎల్లో మీడియా సీరియల్‌గా తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. కొన్ని రోజులుగా వివేకా హత్య విషయమై మీడియాలో కథనాలు లేకపోవడంతో టీడీపీ అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో టీడీపీ నాయకుడు బుద్ధా వెంకన్న మీడియా ముందుకొచ్చారు. ఈ హత్యపై తాము కోర్టును ఆశ్రయిస్తామంటూ సరికొత్త బ్లాక్‌మెయిల్‌కు దిగారు.
వైఎస్ జగన్ వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో బుద్ధా వెంకన్న ఘాటు విమర్శలు చేశారు. ఇప్పటికైనా జగన్ తన బాబాయ్ హత్య కేసులో వాస్తవాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. సొంత బాబాయ్ కావడంతో చంపుకుంటాం, అభాండాలు ఇతరులపై వేస్తాం, కేసులు పెట్టిస్తామంటే కుదరదన్నారు.
వివేకా హత్యలో జగన్ పాత్ర ఉండడం వల్లే, ఆ విషయమై ప్రతిపక్షాలు మాట్లాడొద్దని గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారని ఆయన మరోసారి ఆరోపించారు. అప్పట్లో స్వతంత్ర దర్యాప్తు సంస్థ అయిన సీబీతో కేసు విచారించాలని హైకోర్టును జగన్ ఆశ్రయించారన్నారు. ఆ తర్వాత 2020లో తాను అధికారంలో ఉండగా సదరు పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారని ఆయన గుర్తు చేశారు. సొంత బాబాయ్ అయినప్పటికీ చంపడానికి మీరెవరని ఆయన ప్రశ్నించారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్‌రెడ్డి మీడియా ముందుకొచ్చి ఎందుకు మాట్లాడ్డం లేదని బుద్ధా వెంకన్న ప్రశ్నించారు.
వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని వివేకా హత్య కేసులో నిజానిజాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. అలా జరగని పక్షంలో టీడీపీ కోర్టుకెళుతుందన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా తమపై ఉందన్నారు. వివేకా కుమార్తె వైఎస్ సునీతకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. సునీతమ్మకు ఎలాగూ ఈ ప్రభుత్వం రక్షణ కల్పించదన్నారు. హైదరాబాద్‌లో ఉన్న సునీతకు రక్షణ కల్పించే బాధ్యతను తీసుకోవాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కోరుతున్నామన్నారు.
వివేకా కేసులో సునీత, ఆమె భర్త , బావలను ఇరికించాలనే ప్రయత్నం చేస్తున్న వ్యక్తులు.. ఆమె ప్రాణాలకు కూడా ముప్పు తీసుకురావచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం. వివేకా హత్య కేసును సాకుగా చూపి జగన్‌పై రాజకీయ బెదిరింపులకు దిగడం చర్చనీయాంశమైంది.