డబ్బున్నోళ్ల పెళ్లిళ్లు ఎలా జరుగుతాయి.. అంతా విమానాలు కట్టించుకొని విదేశాలకు వెళ్లి మరీ పెళిళ్లు చేసుకుంటారు. దాని ముద్దుపేరు డెస్టినేషన్ వెడ్డింగ్. ఒకవేళ ఇక్కడే పెళ్లి చేసుకోవాలనుకుంటే ఏకంగా స్వర్గాన్ని కిందకు దించేస్తారు. కళ్లముందు పెళ్లి అనే సినిమా చూపిస్తారు. ప్రజలంతా ఆ పెళ్లి గురించి మాట్లాడుకునేలా చేస్తారు.
అయితే ఇదంతా గతం. ఇప్పుడు పెళ్లిళ్లన్నీ కరోనాకు ముందు, కరోనా తర్వాత అన్నట్టు తయారయ్యాయి. కరోనా తర్వాత సెలబ్రిటీలు, స్టార్లు పెళ్లి చేసుకునే విధానమే మారిపోయింది. ఓ సాధారణ కుటుంబం చేసుకునే పెళ్లికి, స్టార్స్ పెళ్లికి పెద్ద తేడా కనిపించడం లేదు.
నిఖిల్ ఆర్భాటంగా పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఇటు సినీప్రముఖులతో పాటు అటు రాజకీయ నాయకుల్ని కూడా పిలిచి, ఆకాశమంత పందిరి వేసి ధూమ్ ధామ్ గా చేసుకోవాలనుకున్నాడు. కానీ కరోనాతో ఓ ఫామ్ హౌజ్ లో సింపుల్ గా 20-30 మంది కుటుంబ సభ్యుల మధ్య పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. కనీసం పోస్ట్ వెడ్డింగ్ పార్టీ అయినా ఉంటుందా అంటే, ఆ ముచ్చట కూడా కనుచూపు మేరలో కనిపించేలా లేదు.
నితిన్ కూడా అంతే. ఏకంగా డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేశాడు. దుబాయ్ లో గ్రాండ్ గా పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అంతలోనే కరోనా వచ్చింది. ఇంకేముంది ఇతడు కూడా ఫామ్ హౌజ్ కే పరిమితమయ్యాడు. ఈనెల 26న హైదరాబాద్ శివార్లలోని ఓ ఫామ్ హౌజ్ లో అతి కొద్ది మంది అతిథుల సమక్షంలో నితిన్-షాలిని పెళ్లి జరగబోతోంది.
రామానాయుడు మనవడు, సురేష్ బాబు తనయుడు, భారీ సినీనేపథ్యం ఉన్న రానా పెళ్లి కూడా ఇంతే సింపుల్ గా జరగబోతోంది. వచ్చేనెల 8న మిహీకాను పెళ్లాడబోతున్నాడు రానా. తనయుడి పెళ్లి కోసం చాలా అనుకున్నప్పటికీ, కరోనా కారణంగా సింపుల్ గా చేయాల్సి వస్తోందని తండ్రి సురేష్ బాబు ఇప్పటికే ప్రకటించారు. ప్రభుత్వం విధించిన గైడ్ లైన్స్ ప్రకారమే రానా పెళ్లి జరుగుతుందని సురేష్ బాబు స్పష్టంచేశారు.
అటు నాగబాబు కూడా కూతురు పెళ్లి నిరాడంబరంగానే జరుగుతుందని ప్రకటించారు. ఈమధ్యే తనకు కాబోయే భర్త చైతన్యను జనాలకు పరిచయం చేసింది మెగాడాటర్ నిహారిక. పెళ్లి చాలా గ్రాండ్ గా చేసుకుంటానని పలుమార్లు ప్రకటించింది. అయితే నిహారిక ఆశలు నెరవేరేలా లేవు. కరోనా పరిస్థితులు ఉన్నప్పటికీ, లేనప్పటికీ.. తన కూతురు పెళ్లి సింపుల్ గా జరుగుతుందని నాగబాబు ప్రకటించారు. కేవలం మెగాహీరోలు మాత్రమే ఈ పెళ్లికి ప్రత్యేక అతిథులు.
ఇలా సినీ ప్రముఖల పెళ్లిళ్లన్నీ వాళ్లు కలలో కూడా ఊహించని విధంగా సింపుల్ గా జరిగిపోతున్నాయి.