పవన్ పాలిటిక్స్ లో బిజీ అయ్యారు. అన్ని సినిమాలు పక్కనపెట్టి ప్రజల్లో తిరుగుతున్నారు. దీంతో ఆయన నటించిన తాజా చిత్రం 'బ్రో' సినిమాకు పబ్లిసిటీ సమస్య వచ్చిందంటూ కథనాలు వస్తున్నాయి. మరో నెల రోజుల్లో సినిమా రిలీజ్ పెట్టుకొని, పవన్ ఇలా వారాహి యాత్రలతో బిజీగా ఉంటే ఎలా అంటూ చాలామంది చర్చించుకుంటున్నారు.
కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, బ్రో సినిమా పబ్లిసిటీకి పవన్ కల్యాణ్ తో ఎలాంటి సమస్య లేదు. ఆ మాటకొస్తే, పవన్ నటిస్తున్న సినిమాలు వేటికీ, ప్రచారం విషయంలో ఇబ్బందుల్లేవు. ఎందుకంటే, పవన్ అస్సలు ప్రచారానికి రాడు కాబట్టి.
ఒప్పుకున్న సినిమాల్ని పూర్తిచేయడమే ఎక్కువ. షూటింగ్ పూర్తయితే అదే పదివేలు అని భావిస్తున్నారు నిర్మాతలు. అలాంటి హీరో ప్రచారానికి కూడా వస్తాడని ఆశించడం అత్యాశ అవుతుంది. అటు పవన్ కూడా తన సినిమాలకు సంబంధించి నిర్మాతలకు ఫుల్ క్లారిటీ ఇచ్చారు. సినిమా మాత్రమే పూర్తిచేస్తాను, ప్రచారంతో సంబంధం లేదని చెప్పేశారు.
పవన్ క్రేజ్ ను క్యాష్ చేసుకునే ప్రయత్నం..
సో.. బ్రో సినిమాకు కూడా ప్రచారంతో ఎలాంటి ఇబ్బంది లేదు. మరో 4-5 రోజుల్లో ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి త్వరలోనే అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రాబోతోంది. విడుదలకు సరిగ్గా నెల రోజుల ముందు టీజర్ రిలీజ్ చేయాలనేది ప్లాన్.
ఆ తర్వాత దశలవారీగా లిరికల్ వీడియోస్ విడుదల చేసి నెల రోజుల పాటు ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నారు. నిజానికి ఈ సినిమాలో పవన్ తో పాటు సాయిధరమ్ తేజ్ కూడా ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే పవన్ పోర్షన్ కంటే, సాయితేజ్ స్క్రీన్ టైమ్ ఎక్కువ. కానీ ప్రచారాన్ని మాత్రం పవన్ చుట్టూ తిప్పాలని డిసైడ్ అయ్యారు.
ఇక కీలకమైన ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కోసం ఇప్పట్నుంచే పవన్ ను సంప్రదిస్తున్నారు మేకర్స్. ఈ ఒక్క కార్యక్రమానికైనా పవన్ వస్తే బాగుంటుందని భావిస్తున్నారు. అది కూడా మరో వారం రోజుల్లో ఫైనల్ అయ్యేలా ఉంది. వచ్చేనెల 28న థియేటర్లలోకి వస్తోంది బ్రో.