తమ నాయకుడు నారా లోకేశ్‌పై విమర్శలు చేసిన నెల్లూరు సిటీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్‌కు టీడీపీ నేత బీద రవిచంద్ర ఘాటైన సమాధానం ఇచ్చారు. ఏందిరా అనిల్ అంటూ చెలరేగిపోయారు. లోకేశ్‌పై అనిల్ చేసిన విమర్శలేంటో తెలుసుకుందాం.
తాను మంత్రిగా వున్నప్పుడు నెల్లూరు జిల్లాలో అభివృద్ధి జరగలేదని ఆరోపిస్తున్న లోకేశ్ బహిరంగ చర్చకు రావాలని అనిల్ సవాల్ విసిరారు. తమ అధినేత వైఎస్ జగన్ మండుటెండను సైతం లెక్క చేయకుండా పాదయాత్ర చేశారని, లోకేశ్ మాత్రం సాయంత్రం వేళలో విహార యాత్ర చేస్తున్నారని విమర్శించారు. లోకేశ్ సరిగ్గా మాట్లాడ్డానికి భాష నేర్చుకోవాలని అనిల్ హితవు పలికారు.
చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు నెల్లూరు, సంగం బ్యారేజీలను పట్టించుకోలేదని విమర్శించారు. తమ నాయకుడు సీఎం అయిన తర్వాత వాటిని దిగ్విజయంగా పూర్తి చేశారని వివరించారు. ఈ నేపథ్యంలో టీడీపీ నాయకుడు బీద రవిచంద్ర పదునైన మాటలతో అనిల్‌ను తూర్పార పట్టారు. ఎమ్మెల్యే స్థాయిలో అనిల్ కుమార్ భాష చూస్తుంటే అసహ్యమేస్తోందని ఆయన అన్నారు. జగన్మోహన్ రెడ్డి వారంలో నాలుగు రోజులు పాదయాత్ర చేస్తే, మూడు రోజులు కోర్టు యాత్రలు, చీకటి యాత్రలు చేశారని వ్యంగ్యంగా అన్నారు.
ఏంది రా అనిల్… నీకు లోకేశ్ వచ్చి ఏమిచేశామో చెప్పాలా? అని ప్రశ్నించారు. ఇప్పటి వరకు పనిచేసిన నీటిపారుదల శాఖ మంత్రుల్లో అనిల్ అంతటి అసమర్దుడు లేడని విమర్శించారు. పోలవరం మట్టి అమ్ముకోవడం తప్పించి, పనులు పూర్తి చేయలేకపోయావని ఆరోపించారు. మీ సీఎం నీకు గౌరవం ఇవ్వలేదని చెప్పుకొచ్చారు.
సంగం, నెల్లూరు బ్యారేజీ పనులు 15 శాతం మిగిలి ఉంటే ఇప్పటికీ పూర్తికాలేదన్నారు. దమ్ముంటే సంగం బ్యారేజీ దగ్గరికి రా అని సవాల్ విసిరారు. పూర్తికాని సంగం బ్యారేజీని సిగ్గులేకుండా సీఎం జగన్ ప్రారంభించారని బీద రవిచంద్ర విరుచుకుపడ్డారు. ఇదిలా వుండగా బీద రవిచంద్ర, అనిల్‌కుమార్ యాదవ్ ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలు. అందుకే అనిల్‌పై రవిచంద్ర ఘాటు వ్యాఖ్యలు చేయడానికి ముందుకొచ్చారు. బీద రవిచంద్ర సోదరుడు మస్తాన్‌రావు వైసీపీలో రాజ్యసభ సభ్యుడు.